కుటుంబ నియంత్రణ కోసం పురుషులు ఇంతకు ముందు వేసెక్టమీ చేయించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు భారత పరిశోధకులు. ఆపరేషన్ లేకుండానే పురుషుల్లో కుటుంబ నియంత్రణను చిన్న ఇంజక్షన్ తో చేసే విధంగా చేసిన పరిశోధనలో భారత పరిశోధకులు విజయం సాధించారు. ఈ మందును భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. విజయవంతంగా క్లినికల్ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ మందు ఆమోదం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీజీసీఐ)కు పంపారు. ఒకవేళ డీజీసీఐ ఆమోదం తెలిపితే పురుషులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కష్టాలు పోయినట్లే.
రివర్సిబుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్‌ఐఎస్‌యూజీ) అనే ఈ ఇంజెక్షన్‌ను స్టైరీన్ మేలియక్ ఆన్‌హైడ్రైడ్ అనే పదార్థంతో తయారుచేశారు. ఈ ఇంజక్షన్ 13 ఏళ్లు పనిచేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. 13 ఏళ్లతర్వాత దాని సమర్థత తగ్గిపోతుంది. అంటే ఒకసారి ఇంజక్షన్ చేస్తే 13 సంవత్సరాలు పురుషుల్లో పిల్లలు పుట్టే అవకాశం ఉండదన్నమాట.ఈ ఇంజక్షన్ విజయాల రేటు 97.3 శాతంగా ఉందని పరిశోధకులు తెలిపారు.పైగా ఈ ఇంజక్షన్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉండదని పరిశోధకులు అంటున్నారు.
గతంలో కూడా ఇలాంటి ఇంజెక్షన్స్ కోసం పరిశోధనలు జరిగాయి. బ్రిటన్లో 2016లో ఇలాంటి ఇంజక్షన్ ని అక్కడి పరిశోధకులు తయారు చేసారు. కానీ ఆ ఇంజక్షన్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ ఉండటం వల్ల ఆ ఇంజక్షన్ తయారీని ఆపేసారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఇలాంటి ఇంజక్షన్ తయారు చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి.