విశాఖ మహానగరంలో గణనీయ సంఖ్యలో ఉన్న బీసీ సామాజికవర్గాలకు గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ ప్రాధాన్యత లభించింది. వైఎస్సార్సీపీ పరంగా, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పదవుల్లోనూ బీసీ కేటగిరీలోని యాదవ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన వీఎమ్మార్డీఏ అధ్యక్షురాలిగా అక్కరమాని విజయనిర్మలకు, విశాఖ మేయర్ గా హరివెంకట కుమారికి ఊహించని రీతిలో అవకాశం కల్పించిన జగన్.. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి.. ఆయన నిరీక్షణకు తగిన ప్రతిఫలం అందించారు.
అలుపెరుగని నాయకుడు
స్వతహాగా షిప్పింగ్ వ్యాపారంలో ఉన్న వంశీకృష్ణ ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ పార్టీ కాంగ్రెసులో విలీనం కావడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. అప్పటినుంచీ విశాఖ నగరంలో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 2012లో పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014లో మళ్లీ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. 2019లో మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నా సమీకరణాలు కుదరక పార్టీ టికెట్ లభించలేదు. ఈ ఏడాది జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వంశీకృష్ణకే మేయర్ పదవి ఇస్తారని అనుకున్నారు. ఆ మేరకు 21వ వార్డు కార్పొరేటరుగా ఆయన పోటీ చేసి గెలిచారు. అయితే విశాఖ వంటి మహానగర పగ్గాలు మహిళకు అప్పగించాలని జగన్ భావించడంతో చివరి నిమిషంలో వంశీకృష్ణ ఆ అవకాశాన్ని కూడా కోల్పోయారు. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా.. పార్టీపై నమ్మకంతో తిరిగి నగర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
తొలినుంచీ జగన్ వెన్నంటే..
పార్టీలో చేరినప్పటి నుంచీ వంశీకృష్ణ జగన్ వెన్నంటే ఉన్నారు. ఒకవైపు వంశీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరోవైపు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో కీలకంగా పనిచేశారు. ఉప ఎన్నికలు జరిగిన సందర్భాల్లో కడప, పాయకరావుపేట, నెల్లూరు తదితర నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకుడిగా వెళ్లారు. జగన్ ఎప్పుడు విశాఖ వచ్చిన వంశీకృష్ణ ఇంట్లోనే బస చేసేవారు. అటువంటి వంశీకృష్ణకు ఎట్టకేలకు మంచి అవకాశం లభించింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన్ను పార్టీ ఎంపిక చేసింది.
Also Read : Monditoka Arun Kumar- అరుణ్ అంకిత భావానికి జగన్ బహుమతి..