iDreamPost
android-app
ios-app

నాని ‘వి’ విడుదల తేదీ : అఫీషియల్

  • Published Aug 20, 2020 | 7:51 AM Updated Updated Aug 20, 2020 | 7:51 AM
నాని ‘వి’ విడుదల తేదీ : అఫీషియల్

తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని ఓ కొత్త ట్రెండ్ తన రూపాన్ని కింగ్ సైజులోకి మార్చుకుంటోంది. లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిష్చితిలో ఇప్పటికే కొందరు చిన్న సినిమాల నిర్మాతలు తమ చిత్రాలను డిజిటల్ లో రిలీజ్ చేయగా ఇప్పుడు నాని లాంటి స్టార్ రేంజ్ ఉన్న హీరో మూవీ ఓటిటిలోకి రానుండటం సౌత్ ఇండస్ట్రీలో పెను సంచలనం కానుంది. మొదటి నుంచి దీనికి సంబంధించిన ప్రచారం జరిగినప్పటికీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఎప్పటికప్పుడు ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. దిల్ రాజు మాత్రం వ్యూహాత్మక మౌనం వహిస్తూ ఉన్నారు. 

మొత్తానికి అన్నింటికి చెక్ పెడుతూ నిన్న సాయంత్రం నాని ఇవాళ వి తాలూకు అనౌన్స్ మెంట్ ఉంటుందని ముందే క్లూ ఇవ్వడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు. ఆ క్షణాలు వచ్చేసాయి. అధికారికంగా అమెజాన్ ప్రైమ్ ద్వారా విని ఇంట్లోనే చూడొచ్చని కొత్త మోషన్ పోస్టర్ టీజర్ ద్వారా ప్రపంచానికి చెప్పేశారు. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ‘వి’ అందరి ఇళ్లలోకి నేరుగా వచ్చేస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన అమెజాన్ ప్రైమ్ లోగోతో పాటు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇందాకే విడుదల చేసింది. సో ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు డేట్ కూడా పక్కాగా లీకైనదే కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడిది గేమ్ ఛేంజర్ గా మారడం ఖాయం. మరికొందరు ఇదే దారిలోకి రావడానికి పెద్ద టైం పట్టేలా లేదు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన విలో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించగా సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా చాలా కీలకమైన రోల్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఛాలెంజింగ్ సీన్స్ హైలైట్ గా నిలవబోతున్నాయి. అమిత్ త్రివేది పాటలు సమకూర్చగా తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. అదితి రావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. గత మూడు నెలల్లో పాతిక కోట్ల బడ్జెట్ తో రూపొంది ఇలా డిజిటల్ లో విడుదల కాబోతున్న మొదటి సినిమాగా నాని ‘వి’ ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఏడాదిలోనే ఏ సినిమాకు రానన్ని వ్యూస్ ని ప్రైమ్ దీని నుంచి ఆశిస్తోంది. రిస్క్ లేకుండా ఇంట్లోనే కూర్చునే ఛాన్స్ ఉండటంతో కోట్లలో వీక్షణాలు వెల్లువెత్తడం ఖాయం. తన 25వ సినిమా కావడంతో ఈ ఒక్కసారికి డిజిటల్ లో కలుసుకుందామని టక్ జగదీష్ మాత్రం థియేటర్లలో పక్కా అని ప్రామిస్ చేస్తూ ఒక ప్రత్యేక నోట్ విడుదల చేశాడు నాని. సో ఇంకో రెండు వారాల్లో నెవర్ బిఫోర్ ఎంటర్ టైన్మెంట్ కి సిద్ధంకండి మరి.