iDreamPost
android-app
ios-app

కరోనాతో ఉత్తరప్రదేశ్ మంత్రి మృతి

కరోనాతో ఉత్తరప్రదేశ్ మంత్రి మృతి

దేశంలో కరోనా మహమ్మారి ఉదృతంగా వ్యాపిస్తుంది. కరోనా కారణంగా సామాన్యులు మాత్రమే కాకుండా,నాయకులు, సెలెబ్రిటీలు కూడా మృత్యువాత పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు కరోనా కారణంగా మృతి చెందారు. ఆ ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి కమలా రాణి వరుణ్ (62) కరోనా కారణంగా మృతిచెందారు.

యోగి క్యాబినెట్‌లో సాంకేతి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కమలా రాణి కరోనా వైరస్ సోకడంతో జులై 18 న లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కమలా రాణి అడ్మిట్ అయ్యారు. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్న కారణంగా ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ వచ్చింది.దీంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. వైద్యులు ఆమెను కాపాడటానికి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమెను రక్షించలేకపోయారు. దీంతో ఈ ఆదివారం ఉదయం 9.30 నిమిషాలకు కమలా రాణి తుదిశ్వాస విడిచారు.

మంత్రి కమలా రాణి మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ఆమె చేసిన సేవలు మరువలేనివని, ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆమె మృతిపట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆగస్టు 5న జరగనున్న రామమందిర భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి నేడు ఆయన అయోధ్యకు వెళ్లాల్సి ఉంది. కానీ, మంత్రి మరణవార్తతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. కాగా కమలా రాణి మృతి పట్ల ఉత్తరప్రదేశ్ నాయకులతో పాటు పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె సేవలను కొనియాడుతూ ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.