iDreamPost
iDreamPost
టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత విపరీతంగా ఉంది. డిమాండ్ ఉన్నవాళ్లేమో స్టార్లతో మాత్రమే చేసేందుకు ఇష్టపడుతున్నారు. పైగా రెమ్యునరేషన్ పట్టపగలే చుక్కలు చూసే స్థాయిలో అడుగుతున్నారు. పోనీ మీడియం రేంజ్ లో ఉన్న భామలతో సర్దుకుందాం అంటే మార్కెట్ చేసుకోవడంలో ఉన్న ఇబ్బందులతో పాటు వరస ఫ్లాపులతో ఉన్న వాళ్ళ ట్రాక్ రికార్డు భయపెడుతోంది. బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటే ఖర్చుల మోత. కేరళ కుట్టీలు ఇప్పటికే చాలా వచ్చేశారు. ఒకరో ఇద్దరో బాగానే ఉంటున్నారు కానీ మిగిలినవాళ్లతో నేటివిటీ సమస్య. ఈ నేపథ్యంలో ఎవరికైనా అవకాశాలు రావడం అంటే గొప్ప విషయమే అనుకోవాలి.
అలాంటిది అసలు మొదటి సినిమా విడుదల కాకుండా వరుస ఆఫర్లతో పెద్ద బ్యానర్లు దర్శకులు హీరోల సరసన ఛాన్స్ కొట్టేయడం అంటే మాటలా. కృతి శెట్టికి ఏంటో భలే కలిసి వస్తోంది. డెబ్యూ మూవీ ఉప్పెన ఇంకా రిలీజ్ కానే లేదు. లాక్ డౌన్ టైంలో పడిన బ్రేక్ ఇప్పటిదాకా విప్పుకోలేదు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఖచ్చితంగా ఎప్పుడు థియేటర్లలో వదులుతారో చెప్పనేలేదు. వచ్చిన మూడు పాటలు యుట్యూబ్ ని షేక్ చేశాయి. కానీ తనకు మాత్రం ఛాన్సులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఉప్పెన ప్రమోషన్ మెటీరియల్ లో కృతి అందాన్ని చూసి పోటీపడి మరీ లాక్ చేసుకుంటున్నారు.
నానితో శ్యామ్ సింగ రాయ్ పట్టేసుకున్న కృతికి అది బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. భారీ బడ్జెట్ తో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సాయి పల్లవితో కలిసి నానికి జంట కట్టనుంది. సెన్సిబుల్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ త్వరలో సుధీర్ బాబుతో రూపొందించబోయే రొమాంటివ్ ఎంటర్ టైనర్ లో కూడా కృతి శెట్టినే హీరోయిన్. సమ్మోహనంలో అదితి రావు హైదరికి పేరు వచ్చినట్టు తనకూ ఫేమ్ వస్తే పండగే. ఇవి కాకుండా మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి ఈ దూకుడు చూస్తుంటే అదృష్టమంటే ఉప్పెన బ్యూటీదే అనుకోవాలి