బహుశా ఏ డెబ్యూ హీరోకు దొరకనంత గొప్ప వెల్కమ్, ఓపెనింగ్ వైష్ణవ్ తేజ్ కు దక్కింది. భారీ అంచనాలతో థియేటర్లో విడుదలైన ఉప్పెన నిన్న తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను దక్కించుకుంది. నిన్నటి నుంచే వంద శాతం సీటింగ్ కెపాసిటీని మొదలుపెట్టడం, పరిమితులు తీసేయడం లాంటివి బాగా కలిసి వచ్చాయి. ప్రమోషన్ విషయంలో మైత్రి సంస్థ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ దానికి తగ్గ ఫలితాన్నే ఇచ్చింది. టికెట్ రేట్లను పెంచినప్పటికీ జనం దాన్ని పెద్దగా కేర్ చేయలేదు. కొన్ని సెంటర్లలో ఎఫెక్ట్ కనిపించినా హౌస్ ఫుల్ బోర్డులు పడేందుకు అదేమీ అడ్డుగా నిలవలేదు. ఫలితంగా వైష్ణవ్ పెద్ద మేజిక్ నెంబర్లనే నమోదు చేశాడు.
అనధికారికంగా వచ్చిన విశ్వసనీయ ట్రేడ్ సమాచారం మేరకు ఉప్పెన నిన్న ఒక్క రోజే సుమారు 9 కోట్ల 95 లక్షల రూపాయల కలెక్షన్ ని షేర్ రూపంలో మూటగట్టుకుంది. చాలా చోట్ల మొదటి సినిమా హీరోల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. టాక్ ఎలా ఉంది, రివ్యూస్ ఏమంటున్నాయి అనేవి ఇలాంటి వాటి విషయంలో మొదటి రోజు అంతగా ప్రభావం చూపించవు కాబట్టి ఏబిసి అనే తేడా లేకుండా ప్రతి కేంద్రంలోనూ ఉప్పెన తన ముద్ర వేసింది. చాలా గ్యాప్ కావడంతో మెగాభిమానులు కూడా దీనికి అండగా నిలబడ్డారు. ఇక ఏరియాల వారీగా వచ్చిన వసూళ్ల వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి.
– ఏరియా వారీగా ఉప్పెన మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 3.04cr |
సీడెడ్ | 1.38cr |
ఉత్తరాంధ్ర | 1.45cr |
గుంటూరు | 0.66cr |
క్రిష్ణ | 0.62cr |
ఈస్ట్ గోదావరి | 1.02cr |
వెస్ట్ గోదావరి | 0.81cr |
నెల్లూరు | 0.37cr |
Total Ap/Tg | 9.35cr |
రెస్ట్ అఫ్ ఇండియా | 0.25cr |
ఓవర్సీస్ | 0.35cr |
ప్రపంచవ్యాప్తంగా | 9.95cr |
ఈ వీకెండ్ ఉప్పెనకు ఎలాంటి ఢోకా లేనట్టే. ఇదే జోరు కొనసాగుతుంది. పోటీగా వచ్చిన ఒకే ఒక్క సినిమా FCUK ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ రిపోర్టులు మరీ దారుణంగా ఉన్నాయి. ఇది ఇంకా ప్లస్ కానుంది. అయితే ఉప్పెన ఎంతమేరకు లాంగ్ రన్ సాదిస్తుందన్నది వేచి చూడాలి. పబ్లిక్ టాక్ డివైడ్ గానే ఉంది. నిర్మాతలు బ్లాక్ బస్టర్ అంటున్నారు కానీ ఒక వారం గడిస్తే కానీ స్టేటస్ చెప్పలేం. అయినా టాక్ తో సంబంధం లేకుండా బయ్యర్లకు మాస్టర్, రెడ్, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు లాభాలు ఇచ్చినప్పుడు ఉప్పెన అంతకు మించి పెర్ఫర్మ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో వేచి చూడాలి మరి.