iDreamPost
android-app
ios-app

Bjp, yogi – యోగి ఓకే.. బీజేపీ నాట్ ఓకే! -యూపీ ఓటర్ల తాజా మనోగతం

  • Published Nov 29, 2021 | 11:58 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Bjp, yogi – యోగి ఓకే.. బీజేపీ నాట్ ఓకే!  -యూపీ ఓటర్ల తాజా మనోగతం

దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల మూడ్ మారిపోతోంది. ముఖ్యంగా అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలతోపాటు పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో 300కు పైగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా కష్టాల్లో కూరుకుపోతున్నట్లు కనిపిస్తోంది. అక్కడి ప్రజల్లో సీఎం యోగి పట్ల సానుకూలత ఉన్నా ఆయన పార్టీ బీజేపీ పట్ల వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. నెల రోజుల క్రితం ప్రకటించిన ముందస్తు సర్వేల అంచనాల్లో బీజేపీ 220-230 మధ్య సీట్లు సాధించి సాధారణ మెజారిటీతో గట్టెక్కుతుందని భావించగా నెల రోజుల్లోనే ఆ పార్టీపై వ్యతిరేకత పెరగడం విశేషం.

మార్పు కోరుకుంటున్న ప్రజలు 48 శాతం పైనే

వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల మనోగతం తెలుసుకునేందుకు ఏబీపీ- సీ ఓటర్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో యూపీ ఓటర్లు కొంత విచిత్రంగా స్పందించారు. ఒకవైపు ప్రస్తుత సీఎం యోగి మళ్లీ ఆ పదవి చేపట్టాలని కోరుకుంటూనే మరోవైపు బీజేపీ ప్రభుత్వం వద్దనుకుంటున్నారు.

సీఎంగా యోగి పనితీరు బాగుందని 41.5 శాతం మంది వెల్లడించారు. 37.4 శాతం మంది బాగోలేదని, 21.1 శాతం మంది పర్వాలేదని చెప్పారు. ఎన్నికల తర్వాత ఎవరు కొత్త సీఎం కావాలనుకుంటున్నారన్న ప్రశ్నకు 42.8 శాతం మంది యోగికే ఓటు వేశారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు 32.2 శాతం, బీఎస్పీ అధినేత్రి మాయావతికి 15.4 శాతం మద్దతు లభించగా కాంగ్రెస్ నేత ప్రియాంక వైపు కేవలం 3.6 శాతం మొగ్గే కనిపించింది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని 48.3 శాతం మంది కోరుతున్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. 27.5 శాతం మందే అనుకూలంగా ఉండగా 24.2 శాతం మంది ఫర్వాలేదని చెప్పారు. అయితే ఏదో విధంగా మళ్లీ బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని 45.3 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు.

రైతుల ఉద్యమ ప్రభావం గణనీయం

యూపీ ఎన్నికల్లో ఫలితాలపై ప్రభావం చూపే ప్రధానాంశాల గురించి కూడా ఏబీపీ-సీ ఓటర్ సంస్థ అభిప్రాయాలు సేకరించింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఉద్యమం ఎన్నికల ఫలితాలు, పార్టీల బలాబాలాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు వెల్లడైంది. ఈ అంశం 26.9 శాతం పనిచేస్తుందని అంచనా వేశారు. మత రాజకీయాలు 16.1 శాతం, కరోనా నియంత్రణలో వైఫల్యం 15.2 శాతం, మాఫియా-రౌడీ ముఠాలపై వ్యతిరేకత 13.5 శాతం ప్రభావం చూపిస్తాయని సర్వే ద్వారా అంచనా వేశారు. ఇవన్నీ యూపీలోని బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశాలే కావడం గమనార్హం. అలాగే యోగికే లభించిన మద్దతు కంటే బీజేపీపై వ్యతిరేకత శాతం ఎక్కువగా ఉండటం చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కాపాడుకోవడం ఆ పార్టీ కత్తి మీద సాము చేయక తప్పదని తాజా సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.

Also Read: Daggubati Purandeswari – పురందేశ్వరి ప్రస్థానం ముగిసినట్టేనా