iDreamPost
android-app
ios-app

UP Elections – పార్టీల హామీల వర్షం

  • Published Dec 22, 2021 | 12:57 PM Updated Updated Mar 11, 2022 | 10:30 PM
UP Elections – పార్టీల హామీల వర్షం

ఉత్తరాది ఐదు రాష్ట్రాల్లో జరగుతున్న ఎన్నికల్లో వివిధ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. అధికారమే పరమావధిగా హామీలు గుప్పిస్తున్నాయి. యువత, మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని వరాల జల్లు కురిపిస్తున్నాయి. బీజేపీ ఇప్పటి వరకు అధికారికంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదు. అయితే యూపీలో మాత్రం ఎస్‌పీ, కాంగ్రెస్‌ ఎన్నికల హామీ చూసిన తరువాత విద్యార్థులకు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్లు హడావిడిగా పంపిణీకి సిద్ధపడింది. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాంఛల్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు, చిన్నాచితకా స్థానిక పార్టీలు ఓటర్లకు తాయిలాలు ఎరవేస్తున్నాయి.

– ఉత్తరప్రదేశ్‌లో తాము తిరిగి అధికారంలోకి వస్తే కోటి మంది విద్యార్థులకు ఉచిత సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇస్తామని యోగి ఆధిత్యనాథ్‌ ప్రభుత్వం తాజాగా హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ఈనెల 25వ తేదీన అటల్‌ బిహారీ వాజ్‌పాయ్‌ జయంతి రోజున సిఎం యోగి చేేతుల మీదుగా 60 వేల సెల్‌ ఫోన్లు, 40 వేల ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఎంఏ, బీఏ, బీఎస్సీ, ఐటీఐ, ఎంబీబీఎస్‌, ఎండీ, బీటెక్‌, ఎంటెక్‌ తదితర కోర్సులలో చివరి సంవత్సరం చదువుతున్నవారికి తొలి విడతగా అందజేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూ.2,035 కోట్ల నిధులు మంజూరు చేశారు. దీనికితోడు బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచే సమస్యలపై ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు ‘ప్రజా ఆకాంక్ష పెట్టెె’ ప్రవేశపెట్టింది. ఇది 403 నియోజకవర్గాల్లో తిరగనుంది. ప్రజలు లేవనెత్తిన సమస్యలు, వాటి పరిష్కారాలను పరిశీలించి మేనిఫెస్టోలో పెట్టనుంది. డిసెంబరు 15 నుంచి ఇది మొదలైంది. దీనితోపాటు వెబ్‌సైట్‌, ఈ` మెయిల్‌, మిస్‌డ్‌ ఫోన్‌ కాల్‌ ద్వారా కూడా సూచనలు అందజేవచ్చని ప్రజలకు తెలిపింది.

– ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా హామీల వర్షం కురిపిస్తోంది. సమాజ్ వాదీ పెన్షన్‌ యోజన పథకాన్ని పెంచడం, విద్యార్థులకు ఉచిత ల్యాప్‌ టాప్‌, స్మార్ట్‌ఫోన్‌, ఉచితంగా డేటా ఇస్తామని చెప్పుకొచ్చింది. మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయిస్తే రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఇవి కాకుండా రైతులు, మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు అనువుగా మేనిఫెస్టో విడుదల చేసింది. ఉపాధి కల్పన, విద్య, వైద్యానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని హామీ ఇస్తోంది.

– కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రియాంకగాంధీ పలు పథకాలను ప్రకటించారు. ఆమె మహిళా ఓటర్లకు వరాలు కురిపించారు. స్వాతంత్య్ర సమరయోధురాలు రలార్రీ భాయి గుర్తుగా ప్రతీ జిల్లాలోను మహిళలకు స్కిల్క్‌ డెవలప్‌మెంట్‌ పాఠశాలలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకు ఇస్తామని ప్రకటించారు. 12వ తరగతి పాస్‌ అయిన విద్యార్థినీలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తామని,  గ్రాడ్యుయేట్  పూర్తి చేసిన మహిళలకు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు అపరిమిత ఎల్‌పీజీ సిలిండర్లు, ప్రభుత్వ బస్సులలో ఉచిత రవాణా అనుమతి ఇచ్చారు.

– పంజాబ్‌లో తాము అధికారంలోకి వస్తే 18 ఏళ్లు దాటిన ప్రతీమహిళకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని ఆమ్‌ ఆద్మీ (ఆప్‌) హామీ ఇచ్చింది. ఇప్పటికే వృద్ధాప్య పింఛన్‌ పొందినవారికి కూడా అదనంగా ఈ మొత్తం ఇస్తామన్నారు. ప్రతీ ఇంటికీ 300 యూనిట్ల వరకు విద్యుత్‌ ఇవ్వడంతోపాటు నిరంతరాయంగా సరఫరా చేస్తామన్నారు.

– పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ సైతం యూపీ తరహాలో ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు ప్రకటించింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ గా పర్తాప్‌ సింగ్‌ బజ్వాను నియమించింది. 15 రోజుల్లో మేనిఫెస్టో తయారు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, మహిళలకు పెద్దపీట వేస్తామన్నారు.

– పంజాబ్‌లో కొత్తగా జట్టుకట్టిన శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) – బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్సీ) కూటమి కూడా భారీగానే హామీల వర్షం కురిపించింది. పంట నష్టపోతే ఎకరాకు రూ.50 వేల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం పునరుద్దరిస్తామని ప్రకటించారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాలకు ఉచిత విద్యుత్‌, ఇసుక, మద్యం మాఫియాను అంతం చేస్తామని ప్రకటించారు.
– గోవాలో సైతం బీజేపీ సంకల్ప పెట్టి’ పేరుతో ఎన్నికల హామీలు పొందుపరిచి మేనిఫెస్టో తయారు చేయాలని నిర్ణయించింది.