రాఖీ భాయ్ గా యష్ నటించిన కెజిఎఫ్ 2 కోసం అభిమానులే కాదు సినిమా ప్రేమికులు సైతం ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జూలై 16 విడుదల తేదీగా ప్రకటించినప్పటి నుంచి ఈ ఆరు నెలలు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయా అని కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. కేవలం ఈ ఒక్క సినిమాకే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఓపెనింగ్స్ విషయంలో బాహుబలికి ధీటుగా ఓపెనింగ్స్ రాబడుతుందని ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ట్రేడ్ సైతం మంచి నీళ్లలా కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకుంది.
తాజాగా యష్ ఫ్యాన్స్ గ్రూప్ ఒకటి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే ఒక లెటర్ రాశారు. తమ ఎమోషన్ ని అర్థం చేసుకుని జూలై 16ని సెలవు దినంగా ప్రకటించాలని అందులో కోరారు. ప్రాక్టికల్ గా ఇది జరిగే అవకాశం ఒక్క శాతం కూడా లేనప్పటికీ వాళ్ళు దీన్ని పట్ల ఎంత ఆత్రంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. గతంలో రోబో, శివాజీ, బాహుబలి సినిమాలకు ఇలాంటి క్రేజే వచ్చినప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు, సామూహిక సినిమా టికెట్లు స్పాన్సర్ చేసి సూపర్ అనిపించుకున్నాయి. ఇప్పుడు కెజిఎఫ్ 2 కు అంతకు మించిన హైప్ వచ్చేలా స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కెజిఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు అంతా రెడీ అవుతోంది. ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్ బిజినెస్ డీల్స్ ని చకచకా పూర్తి చేస్తోంది. ప్రభాస్ సలార్ కూడా వీళ్లదే కావడంతో అడ్వాన్సులు వరదలా వచ్చిపడుతున్నాయట. కెజిఎఫ్ 2 సుమారు మూడు వందల కోట్ల దాకా వ్యాపారం చేయొచ్చని అంటున్నారు. అన్ని భాషల్లోనూ వస్తుంది కాబట్టి అంతకన్నా ఎక్కువే వచ్చినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ అంచనాలను నిలబెట్టుకుంటే మాత్రం కెజిఎఫ్ 2 సృష్టించబోయే చరిత్ర శాండల్ వుడ్ లో సువర్ణాక్షరాలతో ఉండిపోతుంది