అయోధ్య తీర్పు తర్వాత ఏదో జరుగుతుందని భావించినా అంతా బాధ్యతగా వ్యవహరించడంతో సమస్య కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నారు. కానీ కశ్మీర్ లో రేపిన మంటలు చల్లారలేదు. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నిర్బంధం మరింత పొడిగించారు. నేటికీ ఇంటర్ నెట్ వంటి అనేక సేవలు కశ్మీరీలకు అందుబాటులోకి రాలేదు. అంతా బాగుందని ఓ వైపు చెబుతున్న కేంద్రం, రెండో వైపు నిర్బంధం కొనసాగిస్తున్న వేళ కశ్మీర్ లో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందన్నది కలవరం కలిగిస్తోంది.
అదే సమయంలో పౌరసత్వ సవరణ బిల్లు చిచ్చు పెట్టింది. పెద్ద సమస్యగా మారుతోంది. ఇప్పటికే ఈశాన్యంతో పాటుగా పశ్చిమ బెంగాల్ భగ్గుమంటోంది. ఎన్నార్సీ కావాలంటూ అస్సామీలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. కర్ఫ్యూని ధిక్కరించి, పోలీసు కాల్పులను ఎదురించి లక్షల సంఖ్యలో రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే అరడజను మంది ప్రాణాలు కోల్పోతున్నా ఆందోళన ఆగడం లేదు. త్రిపుర, నాగాలాండ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇదే సమస్య కనిపిస్తోంది. ఇక పశ్చిమ బంగలో ఆందోళన అదుపుతప్పుతోంది. హింసాత్మకంగా మారుతోంది. దాని తాకిడి దేశరాజధానిని కూడా తాకింది. జామియా ఇస్లామియా విద్యార్థుల ఆందోళనపై కేంద్ర బలగాలు తెగబడ్డాయి. ముగ్గురి ప్రాణాలు పోయినట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పుడు దేశమంతటా ఈ నిరసనల తాకిడి సుస్ఫష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే జపాన్ ప్రధాని పర్యటన రద్దయ్యింది. చైనా బృందం కూడా ఈ ఆందోళనల కారణంగా పర్యటనకు సిద్ధంగా లేనట్టు చెబుతోంది. ఐక్యరాజ్యసమితి కూడా విన్నవించింది. అయినా కేంద్రం తగ్గడానికి సుముఖంగా లేదు. కనీసం దేశ ప్రజలను సమాయత్తం చేసేందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు లేవు. ఇంతగా రగులుతున్న భారతీయులను చల్లార్చే చర్యలు అసలు కనిపించడం లేదు. మై హూనా అంటూ ట్విట్టర్ లో చేసిన ఓ ప్రకటన తప్ప ప్రధాని నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ఏకంగా హోం మంత్రి కూడా తన పర్యటనను రద్దు చేసుకున్నారే తప్ప, దేశస్తుల ఆగ్రహాన్ని తగ్గించేందుకు తగ్గట్టుగా వ్యవహరిస్తున్న దాఖలాలు లేవు.
గుజరాత్ అల్లర్ల సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి వస్తోంది. అప్పట్లో అల్లరిమూకలు రెచ్చిపోతున్నా అదుపు చేయాల్సిన దశలో అక్కడిప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తద్వారా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడానికి దోహదపడింది. ఏ మతస్తులయినా మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన దశలో తద్విరిద్ధంగా వ్యవహరించడం అందరికీ తెలిసిందే. దానిద్వారా ఇప్పటి వరకూ అధికారం సుస్థిరం చేసుకోవచ్చు గాక గానీ ప్రపంచమంతా దేశానికి పడిన మచ్చ చెరిగిపోలేదు. దేశంలోని ఓ మతస్తుల్లో అవిశ్వాసం చెదిరిపోలేదు. ఇప్పుడు కూడా కీలకనేతలు మోదీ-షా ద్వయం అదే పంథాను అవలంభించడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అధికారిక గణంకాలే దానికి సాక్ష్యం. అదే సమయంలో దేశమంతటా ఇలాంటి అలజడి మరింత ప్రమాదకరం అవుతుంది. మండల్-మందిర్ ఉద్యమాల ద్వారా 1991లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రం అయ్యిందనే విషయం గమనంలో ఉంచుకోవాలి. గాడితప్పుతున్న దశలో గందరగోళ పరిస్థితులు చేజారిపోవడానికి కారణం అవుతాయి. అయినా అదేమీ తమకు పట్టనట్టుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరించడం పెను ముప్పుని సూచిస్తోంది. ఒక రాష్ట్రంలో ఏర్పడే సమస్య వేరు, ఇప్పుడు దేశమంతటా ఒకే సమస్యపై ఉద్యమం సాగడం వేరు. దీని ప్రభావంతో ఇప్పటికే నాలుగైదు రాష్ట్రాల్లో పరిస్థితులు అదుపుతప్పాయి. కర్ఫ్యూలు, రవాణా నిలిపివేతలు నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో సరయిన స్పందన ప్రభుత్వం నుంచి అవసరం.
కానీ ప్రస్తుతం కేంద్రం దానికి భిన్నంగా ఉంది. ఇలాంటి ఆందోళనల కారణంగా రాజకీయంగా తమ పరపతి మరింత పెరుగుతుందని, గుజరాత్ అనుభవంతో ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. మైనార్టీలలో ఏర్పడే ఉద్వేగం, చివరకు మెజార్టీని తమ వైపు మొగ్గు చూపడానికి, అధికార పీఠం బలపడడానికి దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నట్టుగా ఉంది. ఇలాంటి విభజన రాజకీయాలు చివరకు ప్రతీసారి ఒకే ఫలితాన్ని ఇస్తాయని చెప్పలేం. మతం ఆధారంగా చెలరేగే మంటల్లో ఎంత మంది సమిధలయినా, తాము చల్లగా ఉండాలనుకుంటే కుదురదు. చివరకు వాటి ప్రభావం అందరూ అనుభవించాల్సి ఉంటుంది. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం వస్తుంది. ఆర్థిక, సామాజిక సంక్షోభాలు అస్తవ్యస్తంగా మార్చే ముప్పు ముందర ఉన్న తరుణంలో మరింత అప్రమత్తత అవసరం. దానికి అనుగుణంగా స్పందించాల్సి అవసరం ఉంది.
2957