Idream media
Idream media
సినిమాలు ఆయా కాలంలోని చరిత్రని తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. సమాజంలో వస్తున్న మార్పులని ప్రతిబింబిస్తాయి. సీరియస్‌నెస్ ఎంతోకొంత ఉంటే చాలు వర్తమానాన్ని చూపించొచ్చు. అప్పటి వర్తమానం, భావితరాలకి గతంగా మారుతుంది.
1967, దేశానికి కష్టకాలం. స్వాతంత్ర్యం వచ్చి 20 ఏళ్లు. కొండంత అండగా ఉండే నెహ్రూలేడు. ఆయన కూతురు ఇందిర వచ్చింది. ఉపాధి కోసం నగరాలకి వలసలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కుటుంబాలు విడిపోతున్నాయి. కలిసి ఉండాలన్నా , ఉండలేనితనం. ఈ ఇతివృత్తంతో ఎన్టీఆర్ సొంత బ్యానర్‌లో యోగానంద్ దర్శకత్వంలో ఉమ్మడి కుటుంబం తీశారు.
ఎన్టీఆర్ హీరో, హీరోయిన్ కృష్ణకుమారి. సావిత్రి అప్పటికే వదిన పాత్రకి వచ్చేసింది. నలుగురు అన్నదమ్ముళ్లు, కలిసే ఉంటారు. పెద్దవాడు రేలంగి పట్నంలో గుమాస్తా. వారంలో ఒకరోజు వచ్చి పోతుంటాడు.రెండోవాడు సత్యనారాయణది వ్యవసాయం. మూడోవాడు ప్రభాకర్‌రెడ్డి డాక్టర్, చదువు అయిపోయి పట్నంలో ప్రాక్టీస్. నాలుగో వాడు ఎన్టీఆర్, నాటకాల పిచ్చోడు. తల్లి హేమలత.
ప్రభాకర్‌రెడ్డి , ఒకమ్మాయి (ఎల్.విజయలక్ష్మి) వలలో పడితే ఎన్టీఆర్ వెళ్లి అన్నని విముక్తి చేసి , వదినతో కలపడం కథ. దీంట్లో చాలా ఉపకథలుంటాయి. హీరోకి మారువేషం వేసి , విలన్లకి బుద్ధి చెప్పడం ఆ కాలం దర్శకులు ఎంచుకున్న సులువైన మార్గం. అందుకే మారువేషం లేకుండా ఎన్టీఆర్ సినిమా ఉండదు.
ఉమ్మడి కుటుంబం ఫార్మట్‌ని , కొద్దిగా మార్చి 1970లో ఎన్టీఆర్ కోడలు దిద్దిన కాపురం తీస్తే అది కూడా హిట్. ఇదే కథకి కొద్దిగా తిరగమోత పెట్టి 1972లో కృష్ణ పండంటి కాపురం తీస్తే అదీ సూపర్‌హిట్. మనకు లేనిదాన్ని సినిమాలో కోరుకుంటాం. కలిసి జీవించలేని తనంతో , తెరమీద కలిసి ఉండడం చూసి ప్రేక్షకులు ఆదరించారు.
ఉమ్మడి కుటుంబంలో వాణిశ్రీది చాలా చిన్న పాత్ర. అప్పటికి ఆమె హీరోయిన్ కాలేదు. ఎన్టీఆర్ యముడిగా , సావిత్రిగా వాణిశ్రీ సతీసావిత్రి నాటకంతో ఈ సినిమా మొదలవుతుంది. 1978లో వాళ్లిద్దరు కలిసి సతీసావిత్రి తీయడం ఒక విశేషం. లవకుశ నిర్మాత శంకర్‌రెడ్డి దీన్ని నిర్మించారు.
టీవీ రాజు సంగీతంలో “చెప్పాలని ఉంది” (సినారె) హిట్‌సాంగ్. ఈ సినిమాలో ఇంకొక ప్రత్యేకత ఏమంటే గంటన్నర సినిమా అయిపోయే వరకు హీరోయిన్ ఉండదు. అప్పటి వరకు ఫ్యామిలీ సమస్యలతోనే సినిమాని లాగేశారు.