iDreamPost
iDreamPost
లాక్ డౌన్ జరిగిన ఈ ఆరు నెలల కాలంలో అంతో ఇంతో కంటెంట్ పరంగా రెస్పాన్స్ పరంగా బెటర్ అనిపించిన సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సత్యదేవ్ టైటిల్ రోల్ లో మలయాళం బ్లాక్ బస్టర్ ‘మహేశింటే ప్రతీకారం’కు రీమేక్ గా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అద్భుతం అనిపించకపోయినా థియేటర్ కు వెళ్ళే రిస్క్ లేకుండా ఇంట్లోనే చూసే వెసులుబాటుతో వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో బాగానే ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉండగా నెట్ ఫ్లిక్స్ లోనో ఇతరత్రా ఆన్లైన్ మార్గాల్లోనో ఈ మూవీ మిస్ అయిన వాళ్ళు త్వరలో బుల్లితెరపై చూసేయోచ్చు. ఈ నెల 13న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీ మెయిన్ ఛానల్ లో ఇది ప్రసారం కానుంది.
చాలా కాలం తర్వాత ఈటీవీ టెలికాస్ట్ చేస్తున్న సరికొత్త సినిమా ఇదే. చాలా ఏళ్ళుగా తమ దగ్గరున్న పాత సినిమాలను తప్ప మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టు కొత్త మూవీస్ ని కొనడం ఎప్పుడో ఆపేసిన సదరు ఛానల్ ఏదో కొత్త స్ట్రాటజీని ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ప్రసారానికి ఇంకో విశేషం ఉంది. థియేటర్లలో రాకుండా డైరెక్ట్ గా టీవీలో రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇదేనని అనుభవజ్ఞుల అంచనా. గతంలో హిట్టా ఫట్టా అనే ఫలితంతో సంబంధం లేకుండా ప్రతి సినిమా కనీసం ఒకటి రెండు రోజులైనా థియేటర్లలో నడిచిన చరిత్ర ఉందని ఆర్ట్ లేదా ఆఫ్ బీట్ మూవీస్ కూడా ఏదో ఒక చిత్రోత్సవాల్లో పాల్గొన్నవేనని అలా చూసుకుంటే ఇలా జరగడం మాత్రం ఇదే మొదటిసారని తెలుస్తోంది.
నిజానికి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యను చాలా చోట్ల ఆన్ లైన్ లో అనధికారికంగా డౌన్ లోడ్ చేసి లోకల్ ఛానల్స్ వాళ్ళు ఇల్లీగల్ గా వేశారు. దీని మీద సీరియస్ అయిన ఈటీవీ ఒక సంస్థకు కోటి రూపాయల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసు కూడా పంపించింది. తర్వాత వాళ్ళ అభ్యర్ధన మేరకు విత్ డ్రా చేసుకున్నట్టు న్యూస్ వచ్చింది. ఈ గొడవ కన్నా మనమే వేసేస్తే సరిపోతుంది కదా అని భావించిన ఈటీవీ మొత్తానికి డేట్ ని లాక్ చేసింది. ఇప్పటికీ డిజిటల్ యాప్స్ తో ఎలాంటి అవగాహన లేనివాళ్ళు లక్షల్లో ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా టీవీలోనే సినిమా చూస్తారు కాబట్టి రేటింగ్స్ విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి. మరి థియేటర్ కు రాకుండా నేరుగా టీవీలో వస్తున్న ఉమామహేశుడు ఎలాంటి ఘనతలు సాధిస్తాడో వేచి చూడాలి