iDreamPost
iDreamPost
నవలలు సినిమాలుగా రూపొందటం ఒకప్పుడు ట్రెండ్. ఇప్పుడంటే వీటిని రాసేవాళ్ళు తగ్గిపోయారు కానీ ఆ టైంలో వీటిని లైబ్రరీలుగా పెట్టుకుని జీవోనోపాధిని వెతుక్కున్న వాళ్ళు వేలల్లో ఉండేవారు. ముఖ్యంగా 1980ల ప్రాంతంలో వీటికి విపరీతమైన ఆదరణ. కొన్ని సీరియల్స్ చదవడానికే ప్రత్యేకంగా వార పత్రికలు కొనే పాఠకులు ఉండేవాళ్ళంటే నమ్మశక్యం అనిపించకపోయినా ఇది నిజం. దానికో గొప్ప ఉదాహరణ తులసిదళం. 1980లో ఆంధ్రభూమి వీక్లీ మ్యాగజైన్ లో యండమూరి వీరేంద్రనాథ్ ఈ సీరియల్ రాయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఫ్యామిలీ కథలను ఎక్కువగా చదివే అలవాటున్న చదువరులకు ఓ హారర్ సబ్జెక్టుతో తులసిదళం రావడం ఆశ్చర్యం కలిగింది. వీటిని ఎవరు చదువుతారులే అనుకున్నవాళ్ళు కూడా లేకపోలేదు.
ప్రచురణకు వచ్చిన మొదటివారానికే తులసిదళం రాకెట్ లా దూసుకుపోయింది. ఆంధ్రభూమి పత్రిక హాట్ కేకులా మారిపోయింది. క్షుద్రశక్తులు ఉన్నాయని ప్రేరేపించేలా దీని కథాంశం ఉందని చాలా విమర్శలు వచ్చినప్పటికీ పాఠకులు ఈ సీరియల్ ని విపరీతంగా ఆదరించారు. గుక్క తిప్పుకోనివ్వని సస్పెన్స్, ఏ వారానికి ఆ వారం నెక్స్ట్ ఏం జరుగుతుందాని ఉత్కంఠ కలిగించేలా యండమూరి రాసిన విధానం దీన్ని బ్లాక్ బస్టర్ చేసింది. తర్వాత నవల గా ప్రింట్ చేసి విడుదల చేస్తే అతి తక్కువ కాలంలో 50 వేల కాపీలకు పైగా అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది. ఎందరో ఫ్యాన్స్ గా తయారయ్యారు. తులసి పేరు పెట్టడానికి తల్లితండ్రులు ఆలోచించాల్సి వచ్చిందంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పాలా.
దీన్నే 1985 సంవత్సరం కన్నడలో శరత్ బాబు ప్రధాన పాత్రలో అదే టైటిల్ తో సినిమా తీశారు. తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. వి జగన్నాధరావు దర్శకత్వంలో రూపొందింది. ఆస్తి మీద కన్నేసిన కొందరు దుర్మార్గులు హీరో కూతురి మీద చేతబడి చేసి చంపాలనుకునే దీని కోసం ఎంతటి దుర్మార్గాలు చేశారో ఇందులో చూపించారు. నవల స్థాయిలో సినిమా విజయం సాధించకపోయినా జనాన్ని మాత్రం బాగానే భయపెట్టింది. చాలా ఏళ్ళ తర్వాత ఓ శాటిలైట్ ఛానల్ లో సీరియల్ గా రీమేక్ చేసి టెలికాస్ట్ చేసినప్పుడు మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 2008లో వచ్చిన జగపతిబాబు రక్ష సినిమా కూడా దీని ఆధారంగా రూపొందినదే. తులసి నవల సక్సెస్ తర్వాత సీక్వెల్ ని తులసి పేరుతో యండమూరి ఇంకో భాగం రాశారు. అదీ కాష్మోరా పేరుతో రాజేంద్రప్రసాద్ తో తీశారు. దాని విశేషాలు మరోసారి చూద్దాం.