iDreamPost
android-app
ios-app

టీటీడీకి విదేశీ విరాళాలు బంద్,కేంద్రం వద్ద లైసెన్స్ రెన్యూవల్ ఫైల్ పెండింగ్

టీటీడీకి విదేశీ  విరాళాలు బంద్,కేంద్రం వద్ద లైసెన్స్ రెన్యూవల్ ఫైల్ పెండింగ్

దేశవ్యాప్తంగా డిసెంబర్ 31 2021తో దాదాపు 6వేల ఎన్జీవోలు విదేశీ విరాళాల లైసెన్సును కోల్పోయాయి. ఇందులో ఐఐటీ ఢిల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం సహా తెలుగు వారంతా కొంగు బంగారంగా భావించే వెంకన్నకు ఆలవాలం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం కూడా చేరింది. లైసెన్సు పునరుద్దరణ కోసం దరఖాస్తు చేసుకోని కొన్ని సంస్థలను, కొన్నిటికి దరఖాస్తు చేసినా కేంద్ర హోం శాఖ తిరస్కరణతో ఈ లైసెన్స్ కోల్పోయినట్లు చెబుతున్నారు. కానీ టీటీడీ కూడా అదే రకమైన సమస్య ఎదుర్కొంటోంది.

అసలు ఏంటీ ఎఫ్‌సీఆర్‌ఎ చట్టం?

ఏ ఎన్జీవో సంస్థ అయినా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు, లేదా సంస్థల నుంచీ విరాళాలు కనుక తీసుకోవాలంటే, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద కేంద్ర హోం శాఖ నుంచీ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. 1976లో అమలులోకి వచ్చిన ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) విదేశీ సంస్థల నుండి, వ్యక్తుల నుండి కానీ ఇక్కడి సంస్థలకు ఎటువంటి సహాయం అందాలన్నా చట్టంలో కొన్ని నియమ నిబంధనలు, విధి విధానాలు ఏర్పరిచింది.

2010లో యూపీఎ ప్రభుత్వ హయాంలో ‘ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010’కు సవరణలు చేసి న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలతో పాటు మీడియా రంగాల వారికి విదేశీ విరాళాలను నిషేధించారు. అయితే 2020లో మరికొన్ని సవరణలను మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఆరేళ్లుగా విదేశీ విరాళాలను పొందుతూ వార్షిక ఆదాయ వ్యయాల నివేదికను సమర్పించని వాటిపై చర్యలు తీసుకుంటారు. ముందు నుంచి కంటే ఎక్కువగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు ఉల్లంఘించి విరాళాలు సేకరిస్తూ, వాటిని దుర్వినియోగ పరుస్తున్న అనేక సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తోంది.

అయితే ధార్మిక కార్యక్రమాలతో పాటు, సేవా కార్యక్రమాలకు మాత్రమే విరాళాలు అందించే తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ)కి కూడా విదేశాల నుంచి అందే విరాళాలు ఆగి పోయేలా చేసింది కేంద్ర హోం శాఖ. టీటీడీకి 2020లోనే ఎఫ్ సి ఆర్ ఎ  లైసెన్సు గడువు ముగిసిపోయింది. సకాలంలో రెన్యువల్ కాకపోవడంతో ఏడాది కాలంగా దేవస్థానానికి విదేశీ విరాళాలు ఆగి పోయాయి. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రస్తుత కేంద్ర శాఖ నుంచి ప్రభుత్వం ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తోంది. నిజానికి ఎఫ్ సి ఆర్ ఎ లైసెన్సు గడువు ముగిసిన వెంటనే దేవస్థానం అధికారులు సకాలంలో రెన్యువల్ కోసం దరఖాస్తు చేశారు. మారిన నిబంధనల నేపథ్యంలో కేంద్రం కోరిన వివరాలను పలు దఫాలుగా టీటీడీ విభాగం అధికారులు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి మరీ ఇచ్చి వచ్చారు.

Also Read : ప‌ట్టువీడ‌ని జ‌గ‌న్.. మోడీతో భేటీలో మ‌ళ్లీ తెర‌పైకి..!

ప్రస్తుతం టీటీడీ రెన్యువల్ దరఖాస్తు కేంద్ర హోం శాఖ పరిశీలనలో ఉంది. కాకపోతే ఏడాది పాటు ఈ విరాళాలు పొందే అవకాశమే లేకుండా పోయింది. ఇతర దేశాల్లో భక్తులు,, సంఘాల నుంచి టీటీడీకి ఏటా ఎంత మొత్తంలో విరాళాలు  వస్తున్నదీ అధికారులు వెల్లడించడం లేదు, కానీ సుమారు రూ.50 కోట్ల మేరకు తరహా విరాళాలు అందుతాయని ప్రాథమిక అంచనా. ఇప్పటికైనా లైసెన్స్ రెన్యువల్ జరిగితే మళ్లీ విరాళాలు సేకరించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే కరోనా కాలంలో తగ్గిన ఆదాయాన్ని కొంత మేర ఇతర ధార్మిక కార్యక్రమాలకు వెచ్చించే అవకాశం ఉంటుంది.