iDreamPost
android-app
ios-app

టీటీడీ క్యాలెండ‌ర్ క‌థ‌కు సూత్ర‌ధారులెవ‌రు?

  • Published Dec 01, 2019 | 5:30 AM Updated Updated Dec 01, 2019 | 5:30 AM
టీటీడీ క్యాలెండ‌ర్ క‌థ‌కు సూత్ర‌ధారులెవ‌రు?

సున్నిత‌మైన అంశాల‌ను సంచ‌ల‌నంగా మార్చ‌డం ద్వారా సొమ్ము చేసుకునేయ‌త్నం సాగుతోంది. ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ క్రిస్టియ‌న్ అంటూ వైవీ సుబ్బారెడ్డి మీద క‌థ‌లు అల్లినా చెల్లుబాటు కాలేదు. ఆత‌ర్వాత తిరుమ‌ల కొండ‌ల‌పై సీసీ కెమెరాల కోసం నిర్మించిన ట‌వ‌ర్ ని చూపించి శిలువ‌గా చిత్రీక‌రించాల‌ని చూసి చ‌ట్టం చేత‌ల్లో చిక్కిపోయారు. ఆ త‌ర్వాత టీటీడీ లో భ‌క్తుల భారం వేస్తున్నారంటూ భారీ ప్ర‌చారం చేశారు. కానీ తీరా అలాంటి ఆలోచ‌న లేద‌ని బోర్డ్ చైర్మ‌న్ సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేయ‌డంతో ప్ర‌చారం చెల్లుబాటు కాలేదు.

ఇక ఈసారి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏటేటా ప్ర‌చురించే క్యాలెండ‌ర్ పై దృష్టి సారించారు. క్యాలెండ‌ర్ ద్వారా ఇత‌ర మ‌తాల ప్ర‌చారం చేసేందుకు పూనుకుంటున్నారంటూ ప్ర‌చారం చేయాల‌ని చూశారు. చివ‌ర‌కు గూగుల్ లింక్ పేరుతో టీటీడీ వెబ్ సైట్ లో ఇలాంటి ప్ర‌చారం సాగుతోందంటూ చెప్పేందుకు ప్ర‌య‌త్నించి బోల్తా పడ్డారు. అబ‌ద్ధాల ఆధారంగా అంద‌రినీ న‌మ్మించాల‌నే ప్ర‌య‌త్నాలు ఇప్ప‌టికే ప‌దే ప‌దే ఫ‌లింక‌పోయినా , ఒకే అబద్ధం ఎన్ని మార్ల‌యినా చెప్పి, జ‌నాల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లను మ‌తం పేరుతో చీల్చే య‌త్నంలో కొంద‌రు ఇలాంటి దుష్ట‌య‌త్నాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఈ ప్ర‌య‌త్నాల‌కు తాజాగా టెక్నాల‌జీ నిపుణుడిన‌ని చెప్పుకునే ఒక వ్యక్తి తోడ‌య్యారు. స్వ‌యంగా ఆయ‌న ఫేస్ బుక్ వాల్ మీద టీటీడీకి సంబంధించి కొన్ని పోస్టులు చేసి దొరికిపోయారు. నిరాధ‌ర‌మైన విష‌యాన్ని నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం బెడిసికొట్ట‌డంతో చివ‌ర‌కు త‌న పోస్టుల‌ను డిలీట్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి అత‌నికి ప‌ట్టింది. ఫేక్ పోస్టులు, సోష‌ల్ మీడియాలో సాగించే అబ‌ద్ధపు ప్ర‌చారం గురించి అంద‌రికీ క్లాస్ తీసుకునే ఆ నిపుణుడు తానే అలాంటి ప్ర‌చారం చేస్తూ దొరికిపోవ‌డం వెనుక పెద్ద క‌థే ఉంటుంద‌నే అనుమానాలు వినిపిస్తున్నాయి.

తొలుత ఈనాడు సంస్థ‌ల నుంచి తెర‌మీద‌కు వ‌చ్చిన ఆ నిపుణుడు, త‌ర్వాత సొంతంగా టెక్నాల‌జీ ప‌త్రిక‌ను న‌డుపుతూ ఆంధ్ర‌జ్యోతి కాల‌మిస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆ గూటి నుంచి జ‌రిగిన స్కెచ్ లోఆ నిపుణుడు పాత్ర‌ధారిగా ఉప‌యోగ‌ప‌డిన‌ట్టు ప‌లువురు సందేహిస్తున్నారు. సొంతంగా ఆయ‌న‌కు కొంత పాపులారిటీ ఉండ‌డంతో దానిని ఉప‌యోగించి ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించాల‌నే య‌త్నంలో ఆయ‌న టీటీడీ మీద ఇలాంటి ప్ర‌చారానికి ఒడిగ‌ట్టార‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే దేశ‌మంతా కోట్ల మంది భ‌క్తుల విశ్వాసాల‌తో కూడిన అంశంలో ఇలాంటి దుష్ట‌య‌త్నానికి ఒడిగ‌ట్టి, అన‌వ‌స‌ర అపోహ‌ల‌కు పాల్ప‌డిన విష‌యంలో అస‌లు సూత్ర‌ధారులు ఎవ‌ర‌న్న‌ది దాదాపుగా అంద‌రికీ సునాయాసంగా అర్థ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప‌దే ప‌దే అలాంటి ప్ర‌చారాల ద్వారా ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకోవాల‌నే అలాంటి సెక్ష‌న్ అస‌లు గుట్టు త్వ‌ర‌లో బట్ట‌బ‌య‌లు అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

ఇదంతా పెద్ద వ్యూహ‌త్మ‌క వ్య‌వ‌హారం అన్న‌ది మ‌రోసారి స్ప‌ష్టం అవుతోంది. తొలుత ఆ నిపుణుడు తాను చేసిన పోస్టింగ్స్ లో త‌ప్పిదం దొర్లింద‌ని వాటిని తొల‌గించిన వైనం రుజువు చేస్తోంది. కానీ తాజాగా మ‌ళ్లీ ప్ర‌ధాన ప‌త్రిక‌లు ఆ పాట‌ను అందుకున్నాయి. టెక్నాల‌జీ నిపుణుడు త‌ప్పిదాన్ని తెలుసుకుంటే తాజాగా ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు ప‌త్రిక‌ల్లో రాసిన క‌థ‌నాలు గ‌మ‌నిస్తే ముంద‌స్తు ప్రణాళిక ప్ర‌కార‌మే ఈ ప్రచారం ఉందన్న‌ది రుజువ‌వుతోంది.

సదరు నిపుణుడు, జగన్ ముఖ్యమంత్రి అయినా తరువాత ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల నియామకాల సందర్భంగా అభ్యర్థులు ఇచ్చిన ఆధార్ వివారాలు వైసీపీ పార్టీ వాడుకుంటుందాని,అది డేటా చొర్యం అని ఆరోపణలు చేసిఉండటం గమనార్హం.

నిజానికి స‌ద‌రు ప‌త్రిక‌ల్లో రాసినదే వాస్త‌వ‌మ‌ని విశ్వ‌సిస్తే ఈ ప్ర‌చారం ఏప్రిల్ నెల‌లో జ‌రిగింది. అంటే ఎన్నిక‌ల‌కు ముందు సాగింది. నాటి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో ఇలాంటి ప్ర‌చారం సాగిన విష‌యాన్ని దాచిపెట్టి, దాన్ని ప్ర‌స్తుత ప్రభుత్వం మీద భ‌క్తుల్లో అపోహ‌లు పెరిగేలా చేస్తున్న ప్ర‌య‌త్నం అని రుజువ‌వుతోంది. ఇంత బాహాటంగా వాస్త‌వాల‌ను వ‌క్రీక‌రించి, టీటీడీ వివ‌ర‌ణ‌లు సైతం విస్మ‌రించి సాగుతున్న ప్రచారానికి అస‌లు సూత్ర‌ధారుల విష‌యం జ‌నాల‌కు అర్థం కాద‌నే అపోహ‌ల్లో ఈ మీడియా పెద్ద‌లు ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన త‌ప్పిదాల‌కు ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వారికి ఆపాదించే అత్యుత్సాహం మాత్రం సోష‌ల్ మీడియా యుగంలో జ‌నం అర్థం చేసుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదన్న‌ది వారు గ్ర‌హించ‌లేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.