iDreamPost
android-app
ios-app

కరోనా నాటకాలు.. అడ్డంగా బుక్కయిన మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త..

కరోనా నాటకాలు.. అడ్డంగా బుక్కయిన మాజీ మంత్రి అఖిల ప్రియ భర్త..

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం మాటల్లో వర్ణించలేనిది. ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వైరస్‌ వల్ల ప్రజల ప్రాణాలేకాదు యావత్‌ ప్రపంచం స్తంభించిపోయింది. దాని వల్ల జరిగిన నష్టం అంచనా వేయలేం. అయితే కరోనా వల్ల నష్టమే కాదు.. కొంత మంది దాని వల్ల లాభాలు పొందాలని చూస్తున్నారు. కంటికి కనపడని వైరస్‌ను అడ్డుపెట్టుకుని నేరాలు చేయడం, నేరాల నుంచి తప్పించుకునే ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తిరుపతి, హైదరాబాద్‌లలో భార్యలను హత్య చేసి కరోనా వైరస్‌ వల్ల చనిపోయారంటూ నమ్మించే ప్రయత్నం చేసిన భర్తలు.. ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చి కటకటాలపాలయ్యారు.

తాజాగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్‌ రామ్‌ కూడా కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని కోర్టు విచారణ నుంచి తప్పించుకోవాలని ప్లాన్‌ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. కిడ్నాప్‌ కేసులో భూమా అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్, మరిది జగత్‌ విఖ్యాత్‌రెడ్డిలపై బోయినపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో భూమా అఖిల ప్రియ అరెస్ట్‌ అయి బెయిల్‌ పై విడుదల కాగా.. మిగతా ఇద్దరూ పరారయ్యారు. పలుమార్లు ప్రయత్నించిన తర్వాత ముందస్తు బెయిల్‌ పొంది.. అజ్ఞాతం నుంచి బయటకు వచ్చారు. అయితే ఈ నెల 3వ తేదీన కోర్టులో విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. దాన్ని నుంచి తప్పించుకునేందుకు తమకు కరోనా సోకిందని 1వ తేదీన పోలీసులకు చెప్పారు. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లుగా ఉన్న సర్టిపికెట్లను పోలీసులకు అందించారు.

భార్గవ్‌ రామ్‌ వ్యవహారశైలిపై ముందునుంచే ఒక అవగాహన ఉన్న పోలీసులు.. ఆ సర్టిఫికెట్లను నమ్మలేదు. నిజా నిజాలు తెలుసుకునేందుకు పరీక్షలు జరిపారని పేర్కొన్న ఆస్పత్రికి వెళ్లి విచారించారు. విచారణలో అవి నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు గుర్తించారు. కరోనాను అడ్డుపెట్టుకుని కిడ్నాప్‌ కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నించిన భార్గవ్‌ రామ్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది. కోర్టును, పోలీసులను తప్పుదారి పట్టించిన భార్గవ్‌ రామ్, జగత్‌ విఖ్యాత్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చే శారు. వారికి నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చిన ఆస్పత్రి సిబ్బందిపైనా బోయినపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు.

Also Read : కేసీఆర్‌ తలొగ్గారు.. ఇదిగో నిదర్శనం