iDreamPost
android-app
ios-app

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు మారణాయుధాలతో చేరుకున్న ట్రంప్ అభిమానులు..

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్దకు మారణాయుధాలతో చేరుకున్న ట్రంప్ అభిమానులు..

హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్షు ఎన్నికల్లో అధ్యక్ష పీఠం ఎవరిని వరించనుందో ఇప్పటికే ఖరారైంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓటమి దాదాపుగా ఖరారైన తరుణంలో ట్రంప్ అభిమానులు మారణాయుధాలతో ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవడం కలకలం సృష్టిస్తుంది.

అరిజోనా రాష్ట్ర ఓట్ల లెక్కింపులో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 50.7శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారు. కాగా డెమొక్రాట్స్ ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయుధాలు ధరించిన ట్రంప్ మద్దతుదారులు మరికోపా కౌంటీ ఎలక్షన్ కేంద్రానికి చేరుకుని డెమొక్రాట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా చివరి ఓటు వరకు లెక్కించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. సుమారు 150 మంది మద్దతుదారులు ఆయుధాలతో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగే ప్రదేశంలో బైడెన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వీరిలో కొందరి దగ్గర ఏఆర్-150 రైఫిల్స్ ఉండగా మరికొందరు వద్ద వేరే మరణయుధాలు ఉండటం గమనార్హం.

కాగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఆటంకం రాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేసి షెడ్యూల్ ప్రకారమే ఫలితాన్ని వెల్లడిస్తామని మరికోపా కౌంటీ చీఫ్ డిప్యూటీ రికార్డర్ కీలే వర్వెల్ స్పష్టం చేశారు. ఇప్పటికే అధ్యక్ష పీఠం జో బైడెన్ దేనని దాదాపుగా ఖరారు అయిన నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే.