iDreamPost
android-app
ios-app

నిజమైన ప్రేమకు నిర్వచనం – Nostalgia

  • Published Nov 05, 2020 | 2:28 PM Updated Updated Nov 05, 2020 | 2:28 PM
నిజమైన ప్రేమకు నిర్వచనం – Nostalgia

సినిమా ప్రపంచంలో ఆధిపత్యం కమర్షియల్ జానర్ దే అయినప్పటికీ ప్రేక్షకుల హృదయాలను తడిచేసే చిత్రాలు ఎప్పుడూ ఫెయిల్ కావు. వసూళ్ల కోణంలో కొంత నిరాశపరచవచ్చేమో కానీ కాలం గడిచే కొద్దీ వాటి గొప్పదనం ఇంతింతై వటుడింతై స్థాయిలో అలా పెరిగిపోతూనే ఉంటుంది. అలాంటిదే నిరీక్షణ. 1982లో సుప్రసిద్ధ కెమెరామెన్ బాలు మహేంద్ర భానుచందర్ హీరోగా సహజ నటి అర్చన హీరోయిన్ గా ప్రాజెక్ట్ ని ప్రకటించినప్పుడు ఇదేం కాంబినేషన్ అని అందరూ ఆశ్చర్యపోయారు. పడికట్టు సూత్రాలకు భిన్నంగా ఆలోచించే బాలు మహేంద్ర నిరీక్షణ కోసం అలాంటి కథే రాసుకున్నారు. మాస్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో వచ్చిన ఆణిముత్యం ఇది. నిజమైన కల్ట్ క్లాసిక్ గా దీన్ని చెప్పుకోవచ్చు

ట్రాన్స్ఫర్ మీద అటవీ ప్రాంతానికి వచ్చిన హీరో(భానుచందర్)ఒక ఫారెస్ట్ ఆఫీసర్. అక్కడే చలాకిగా అమాయకంగా తిరిగే గిరిజన అమ్మాయి(అర్చన)ని ప్రేమిస్తాడు. ఓసారి హఠాత్తుగా పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేస్తారు. దురదృష్టశాత్తు అచ్చుగుద్దినట్టు ఓ నక్సలైట్ పోలికలు ఉండటమే దానికి కారణం. అది రుజువు చేసే లోపే అనుకోకుండా ఓ పోలీస్ ని చంపేస్తాడు హీరో. దీంతో జైలు శిక్ష పడుతుంది. ఏళ్లకేళ్లు కారాగారంలో మగ్గిపోతాడు. ఇతని కోసమే అక్కడ తులసి కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటుంది. విడుదలయ్యాక ఆమె ఉంటుందనే నమ్మకంతో ఊరికి బయలుదేరిన ఇతనికి పొలిమేరలో దీపాలతో స్వాగతం చెబుతుంది తులసి. అలా ఈ ఇద్దరి ప్రేమకథ సుఖాంతమవుతుంది.

నిరీక్షణ కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోవడానికి కారణం అందులో నిజాయితీ. ఓ అమాయుకుడికి ఏర్పడ్డ నిస్సహాయ స్థితి అతన్ని చీకటిలో తోసేస్తే కేవలం ప్రేమను నమ్ముకుని అతను ఆమె చేసే నిరీక్షణ ఆలస్యమైనా వాళ్ళ జీవితాల్లో వెలుగును తెస్తుంది. ఈ అంశాన్ని బాలు మహేంద్ర అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా భానుచందర్ జైలులో గడిపే సన్నివేశాలు గుండెలు పిండేసేలా ఉంటాయి. అల్లు రామలింగయ్య, పిఎల్ నారాయణ, సత్యనారాయణ ఇలా క్యాస్టింగ్ కూడా చాలా పరిమితంగా ఉంటుంది.ఇళయరాజా సంగీతం నిరీక్షణను ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. ఆకాశం ఏ నాటిదో అనురాగం ఆనాటిది, చుక్కల్లే తోచావే పాటలు దశాబ్దాలు దాటుతున్నా ఇప్పటికీ వాడిపోని పరిమాణాలు వెదజల్లుతూనే ఉంటాయి.