తెలంగాణలో ఇప్పుడు రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టే తిరుగుతోంది. మొన్నటి దాకా ఇక్కడ ఎలా అయినా గెలిచి తీరాలి అని సర్వ శక్తులు ఒడ్డింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈటెల ఎగ్జిట్ వరకు టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్‌లో తాజా ఉప ఎన్నిక చేదు అనుభవాన్ని మిగిల్చడమే కాక అనేక తలనొప్పులను సైతం తెచ్చిపెట్టింది. ఇక్కడ గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ సంధించిన అస్త్రాలన్నీ ఎదురుతిరిగాయి. ఈటల రాజీనామా మొదలు ఉప ఎన్నిక పోలింగ్ దాకా టీఆర్‌ఎస్ సర్వశక్తులూ ఒడ్డినా బొక్కబోర్లా పడిన పరిస్థితి. ఈటలపై అవినీతి ఆరోపణలు వచ్చిన మొదట్లో ఆయనను ఇంకా మంత్రి పదవి నుంచి తప్పించక ముందే జాగ్రత్త పడిన కేసీఆర్ హుజూరాబాద్‌లో పార్టీ యంత్రాంగం చేజారకుండా హరీశ్‌రావు అండ్ టీమ్ ను అక్కడి బాధ్యతలు అప్పగించారు.
హరీష్ రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదుగా. టీఆర్‌ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కో–ఆపరేటివ్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, సహా నేతలెవరూ ఈటల వెంట నడవకుండా సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి కట్టుదిట్టం చేశారు. 2018 ఎన్నికల్లో ఈటలపై పోటీచేసిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌రెడ్డిని, బీజీపీలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కశ్యప్‌రెడ్డిలు సహా ఆయా పార్టీల లోకల్ కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంది. ఇక హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అక్కడి టీఆర్‌ఎస్ నాయకులకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ముందుగా స్థానిక ఎస్సీ నేత బండా శ్రీనివాస్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా, గతంలో ఈటలపై పోటీచేసి ఓడిన వకుళాభరణం కృష్ణమోహన్ బీసీ కమిషన్ చైర్మన్‌గా నియమించింది. ఇక పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ మంత్రివర్గం తీర్మానించి గవర్నర్ కు పంపింది. దాని స్టేటస్ ఏంటో తెలియాల్సి ఉంది.
Also Read : Etela Rajendhar – హుజురాబాద్ గెలుపు.. స్వయం కృషి
ఇక హుజూరాబాద్ నియోజకవర్గం కాకపోయినా.. ఈ నియోజకవర్గం మీద సామాజిక వర్గ నేపథ్యంలో ప్రభావం చూపుతారని భావిస్తున్న మాజీమంత్రి, టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ఊహాగానాలు కూడా ఆ మధ్య జరిగాయి. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన మరో నేత పింగళి రమేశ్‌కు ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత యోచిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఏమీ వర్కౌట్ కాలేదు కాబట్టి ఇవి అటక ఎక్కుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన అనేక మంది నేతలకు పదవులు దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ కోసం ఇప్పుడు ప్రెజర్ పెరిగే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో ఎంతోకాలంగా పదవుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు అలకపాన్పు ఎక్కే అవకాశం లేకపోలేదు. నిన్న మొన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఎంతో ప్రాధాన్యం ఉన్న పదవులు కట్ట పెట్టిన హైకమాండ్.. పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ జెండా మోస్తున్న వారిని నిర్లక్ష్యం చేస్తోందని అసంతృప్తి ఇప్పటికే మొదలైంది. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలా సద్దుమణిగేలా చేస్తారో చూడాలి.
Also Read : KCR Rule – ఈ రెండేళ్లు కేసీఆర్ కు పులి స్వారీనే.. ఈ లెక్కలు మారితే కష్టమే.!