iDreamPost
android-app
ios-app

మెగా మూవీలో నయన్ స్థానంలో త్రిష ?

  • Published Feb 07, 2021 | 5:28 AM Updated Updated Feb 07, 2021 | 5:28 AM
మెగా మూవీలో నయన్ స్థానంలో త్రిష ?

ఆచార్య షూటింగ్ పూర్తవ్వగానే వెంటనే లూసిఫర్ రీమేక్ కోసం రంగంలోకి దిగబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. గత ఏడాదిగా వర్క్ చేస్తున్న స్క్రిప్ట్ కాబట్టి సర్వం సిద్ధంగా ఉంది. దర్శకుడు మోహన్ రాజా మెగా గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరోపక్క క్యాస్టింగ్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఓ కీలక పాత్ర కోసం సత్యదేవ్ లాకైపోయాడు. ముఖ్యమైన సోదరి క్యారెక్టర్ కోసం ఇంకెవరిని అనుకుంటున్నారో తెలియలేదు. నయనతార పేరు బయటికి వచ్చింది కానీ వాస్తవానికి తనను అనుకున్నది ఒరిజినల్ వెర్షన్ లో లేని ఇక్కడ అదనంగా జోడించిన హీరోయిన్ కోసమట. అయితే లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చి పడింది.

డేట్ల సర్దుబాటు కావడం లేదో ఇంకేదైనా కారణమో తెలియదు కానీ నయనతార లూసిఫర్ రీమేక్ చేయలేనని చెప్పిందట. ఇప్పుడు తన స్థానంలో త్రిషను తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం. ఈ ఇద్దరి కాంబినేషన్లో 2006లో స్టాలిన్ వచ్చింది. బ్లాక్ బస్టర్ కాకపోయినా మెగా మూవీలో నటించిన సంతృప్తి త్రిషకు దక్కింది. నిజానికి ఆచార్యకు ముందు అనుకున్నది తననే. అయితే ఏవో బయటికి చెప్పని కారణాలతో డ్రాప్ అయ్యింది. అప్పుడు కాజల్ అగర్వాల్ ను తీసుకొచ్చారు. ఇప్పుడు లూసిఫర్ కోసం మళ్ళీ ట్రై చేస్తున్నారంటే విశేషమే. మోహన్ రాజా ఇప్పటికే త్రిషను కలిసినట్టు వినికిడి.

సో ఏదున్నా ఈ నెలలోనే తేలిపోవాలి. కాల్ షీట్స్ ఫైనల్ అయితేనే మిగిలిన ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్లు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సీరియస్ యాంగిల్ లో సాగే ఈ సినిమాలో కమర్షియల్ హంగులు లోటు లేకుండా చూసుకుంటున్నారని తెలిసింది. అభిమానుల అంచనాలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగానే మార్పులు చేర్పులు చేస్తున్నారు. మొదటిసారి మెగాస్టార్ ఆఫర్ పట్టిన తమన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టాడు. అన్నీ సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివరిలోనే లూసిఫర్ రీమేక్ విడుదల ఉండొచ్చు. బైరెడ్డి అనే టైటిల్ ముందు నుంచే ప్రచారంలో ఉంది.