iDreamPost
iDreamPost
ఇప్పుడంటే ఓటిటి విప్లవం మొదలయ్యాక సైకో బేస్డ్ సినిమాలు, సిరీస్ లు ఎక్కువ చూస్తున్నాం కానీ సౌత్ లో ఈ జానర్ ని ఎప్పుడో టచ్ చేసిన సంగతి కొత్త తరానికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. 1978లో భారతీరాజా దర్శకుడిగా మొదటి రెండు సినిమాలను గ్రామీణ నేపథ్యంలోనే తీయడంతో ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన కలిగింది. అంతకు ముందు తమిళనాడులో సంచలనం సృష్టించిన విమెన్ సైకో కిల్లర్ రమణ్ రాఘవ గురించి తెలిసింది. ఆ కథనే వెండితెర మీద చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే సిగప్పు రోజాక్కళ్. తెలుగులో ఎర్ర గులాబీలుగా వచ్చింది.
దిలీప్(కమల్ హాసన్)పైకి ఉన్నతంగా కనిపించే వ్యాపారవేత్త. అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను లోబరుచుకుని హత్యలు చేసే దారుణమైన మనస్తత్వం ఉంటుంది. బట్టల దుకాణంలో పని చేసే శారద(శ్రీదేవి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే దిలీప్ గురించిన దారుణమైన వాస్తవాలు, చేసిన నేరాలు శారదకు అత్తారింటికి వచ్చాక తెలుస్తాయి. తన ప్రాణం కూడా ప్రమాదంలో పడిందని భావించిన శారద అతన్నుంచి తప్పించుకుని పోలీసులకు దొరికేలా చేస్తుంది. జైలులో దిలీప్ మానసిక స్థిమితం తప్పి శారదను తలుచుకుంటూ గడుపుతాడు. ఆమె రెండో పెళ్లి చేసుకోకుండా ఇతని కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది.
అప్పటిదాకా ఒకరకమైన కమర్షియల్ ఫార్ములాలో సినిమాలు చూసి అలవాటైన ప్రేక్షకులకు ఎర్రగులాబీలు భయంతో కూడిన అద్భుతమైన అనుభూతినిచ్చింది. విపరీత మనస్తత్వం ఉన్నవాడిగా కమల్ హాసన్ నటన నీరాజనాలు అందుకుంది. ఫలితంగా ఈ సినిమా 175 రోజులు ప్రదర్శింపబడి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. భాగ్యరాజా సంభాషణలు, ఇళయరాజా సంగీతం దీని స్థాయిని అమాంతం పెంచాయి. హాలీవుడ్ లో మాత్రమే వచ్చే ఇలాంటి సైకో మూవీస్ ని మనం కూడా డీల్ చేయొచ్చని భారతీరాజా నిరూపించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని శింబు మన్మథతో మొదలుకుని ఇటీవలే వచ్చిన మిస్కిన్ సైకో దాకా ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం.