కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు.. మనిషి కుక్కను కరిస్తే అది వార్త అని జర్నలిజం పాఠాలలో చెప్పారు. ఏది వార్త.. ఏది వార్త కాదు.. అనేది రిపోర్టర్ గుర్తించాలనేదే ఇందులోని అర్థం. ప్రస్తుత జర్నలిజం ఈ విషయాన్ని ఎప్పుడో మరిచిపోయింది. ప్రధానంగా పత్రికలు, వాటి తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. ఎవరి అజెండా మేరకు వారు వార్తలు రాస్తున్నారు, ప్రచురిస్తున్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపులు లేవు. వైఎస్ జగన్‌కు వ్యతిరేకం.. అనే అజెండాను అమలు చేసేందుకు ఆంధ్రజ్యోతి పత్రిక కంకణం కట్టుకున్నది అనే విషయం తెలిసిందే. ఈ విషయంలో చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ రోజు ‘ఒక మరణం.. ఒక వివాహం.. బెజవాడ వాసులకు నరకం’ అంటూ ఓ బ్యానర్ వార్త రాసింది.
అసలు ఏందీ ఈ వార్త అని చూస్తే.. ఆ మరణం, వివాహానికి సీఎం వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి వెళ్లడం వల్ల బెజవాడ వాసులు ఇబ్బందులు పడ్డారని రాసుకొచ్చింది. శుక్రవారం రాత్రి ఎమ్మెల్సీ కరిమున్నీసా గుండెపోటుతో చనిపోయారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించేందుకు జగన్ వెళ్లారు. రాత్రి మళ్లీ సీనియర్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కుమారుడి వివాహానికి హాజరయ్యారు. ఈ రెండు సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ చేయడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారనేది ఆంధ్రజ్యోతి బ్యానర్ కథనంలోని సారాంశం.
Also Read : YS Jagan, KCR – వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్
పార్టీ ఎమ్మెల్సీ కరిమున్నీసా మరణించారు. సాధారణ కార్యకర్త అయిన ఆమెను వైసీపీ ఎమ్మెల్సీని చేసి 9 నెలలు కాలేదు. ఇంతలోనే ఆమె హఠాన్మరణం చెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఇక పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు వివాహం. ఆ వివాహంలో వధువు కూడా వైసీపీ కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కూమార్తెనే. పార్టీ ప్రజా ప్రతినిధి హఠాన్మరణం చెందినప్పుడు.. నివాళులర్పించడం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం పార్టీ అధినేతగా జగన్ విధి. అదే విధంగా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించడం ఆయన బాధ్యత. ముఖ్యమంత్రి బయటకు వస్తే.. ప్రొటోకాల్ ఉంటుంది. రక్షణపరమైన అంశాలపై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పదవిలో ఇంతకు ముందు చంద్రబాబు ఉన్నా.. ఇప్పుడు జగన్ ఉన్నా… పాటించాల్సిందే. జగన్ సీఎం అయ్యాక.. ఇదేమీ కొత్తగా తెచ్చిన విధానం కాదు.
అయినా పనికట్టుకుని జగన్‌పై వ్యతిరేక వార్తలు రాసే ఆంధ్రజ్యోతికి.. ఇది కూడా వార్త అయింది. అదీ కూడా బ్యానర్ వార్త కావడం విశేషం. ఒక మరణం.. ఒక వివాహం.. బెజవాడ వాసులకు నరకం.. అంటూ రైమింగ్ పదాలతో శీర్షిక పెట్టి.. అసలు జగన్ బయటకు రావడమే బెజవాడ వాసులకు నరకం అనేలా వార్తను వండి వార్చింది. జగన్ బయటకు రావడం వల్ల బెజవాడ వాసులకు నరకమో కాదో తెలియదు కానీ.. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నంత కాలం తమకు నరకమేనని ఆంధ్రజ్యోతి భావిస్తోందన్నది కాదనలేని సత్యం.
Also Read : ABN RK Kotha Paluku, Chandrababu Crying – చంద్రబాబు కన్నీళ్లకు రాధాకృష్ణ భాష్యం