iDreamPost
iDreamPost
భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న తెలంగాణాకు తమ వంతు సాయం చేయడానికి టాలీవుడ్ ముందుకు వచ్చింది. కరోనా మహమ్మారి తగ్గుతోందని ఆనందపడుతున్న సమయంలో ఇలా వాన రూపంలో ముంచుకొచ్చిన విపత్తుకు రాష్ట్రం తల్లడిల్లుతోంది. అందులోనూ హైదరాబాద్ నగరం చిగురుటాకులా వణికిపోతోంది. చాలా ప్రాంతాలు నిండా మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ స్థాయిలో ప్రమాదాన్ని ఎవరూ ఊహించకపోవడంతో సగటు నగరవాసి నరకం చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఆపద సమయంలో సినీ ప్రముఖులు తామున్నామంటూ చేయూత ఇస్తున్నారు. అందరికంటే ముందుగా నిన్న నందమూరి బాలకృష్ణ సిఎం రిలీఫ్ ఫండ్ కు కోటిన్నర విరాళం ప్రకటించి తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఈ వెల్లువ కొనసాగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ చెరో కోటి రూపాయలు ప్రకటించారు. ప్రభాస్ కోటిన్నర ఇచ్చి పెద్దమనసు చాటుకున్నారు. నాగార్జున అరకోటి డొనేట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షలు అందించగా, త్రివిక్రమ్, హారిక హాసిని సంస్థ చెరో 10 లక్షలు ఇచ్చాయి. విజయ్ దేవరకొండ 10 లక్షలు, అనిల్ రావిపూడి, బండ్ల గణేష్, హరీష్ శంకర్ చెరో 5 లక్షలు తమ వంతు సాయం ఇచ్చారు. రామ్ పోతినేని 25 లక్షలు ఇందాకే అనౌన్స్ చేశారు. ఇది కొనసాగబోతోంది. ఇంకా స్పందించాల్సిన నిర్మాణ సంస్థలు హీరోలు నటీనటులు చాలా ఉన్నారు. సాయంకాలానికి ఈ మొత్తం భారీగా జమయ్యే అవకాశాలు ఉన్నాయి. మంత్రి కెటిఆర్ వ్యక్తిగతంగా ట్విట్టర్ వేదికగా ప్రతిఒక్కరికి థాంక్స్ చెబుతున్నారు. పలువురు మంత్రులు కూడా పర్సనల్ గా కృతజ్ఞతలు చెప్పారు.
ఇలాంటి కష్టకాలంలో ఒకరి అండ మరొకరికి చాలా అవసరం. 2020లో కరోనా వల్ల షూటింగులు ఆగిపోయి వందల కోట్ల నష్టాన్ని చవిచూసిన టాలీవుడ్ కు ఇప్పుడీ వరదలు దాన్ని తీవ్రం చేయబోతున్నాయి. థియేటర్లు తెరిచేందుకు రేపో ఎల్లుండో మార్గం సుగమం అవుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో ఇంకాస్త ఆలస్యం చేస్తూ ఇలా జరగడం నిజంగా విచారకరం. టీవీ ఛానల్స్ లో హైదరాబాదీల కష్టాలు ఇబ్బందులను చూస్తున్న సగటు జనం కదిలిపోతున్నారు. గత వందేళ్లలో ఎన్నడూ రాని స్థాయిలో మహానగరం ఇలాంటి వర్షాన్ని ఎదురుకోవాల్సి రావడం విషమపరీక్షే. ఇంకో రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందన్న సూచనల మేరకు విరాళాలు ఇస్తున్న స్టార్లు మిగిలినవాళ్లకు కూడా పిలుపునిస్తూ స్ఫూర్తినందిస్తున్నారు