iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ నిర్మాతల కొత్త నిర్ణయాలు

  • Published Oct 04, 2020 | 5:40 AM Updated Updated Oct 04, 2020 | 5:40 AM
టాలీవుడ్ నిర్మాతల కొత్త నిర్ణయాలు

కరోనా తెచ్చిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో లెక్క గట్టడం కష్టం. ఆరు నెలలు మొత్తం స్తంభించి పోయి చిన్న జూనియర్ ఆర్టిస్టులుతో మొదలుకుని బడ్జెట్ సినిమాల నిర్మాతల దాకా అందరూ భాదితులుగా మారిన వాళ్ళే. స్టార్ హీరోలు, సెటిల్డ్ నటీనటులు మరీ తీవ్రంగా ఇబ్బంది పడలేదు కానీ ప్రభావం చెంది దెబ్బ తిన్న వాళ్ళే ఎక్కువ. ముఖ్యంగా కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ప్రొడ్యూసర్లు వడ్డీలు ఇతరత్రా ఆర్ధిక ఒత్తిళ్ళు చాలా ఎదురుకున్నారు. ఈ గడ్డు కాలం ఇంకొన్ని నెలలు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. అందులో భాగంగా ఆక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)తో కుదుర్చుకున్న ఒక అవగాహనా ఒప్పందం మేరకు లాక్ డౌన్ కు ముందు తీసుకున్న రెమ్యునరేషన్లలో ఇకపై 20 శాతం తగ్గించబడుతుంది. రోజుకు 20 వేలు మాత్రమే తీసుకునే ఆర్టిస్టులకు మాత్రం ఇందులో మినహాయింపు ఉంటుంది. అలాగే సాంకేతిక నిపుణులు సైతం సినిమాకు 5 లక్షలు ఆపైబడి తీసుకుంటున్న వాళ్ళు కూడా ఈ ఇరవై శాతం పరిధిలోకే వస్తారు. మళ్ళీ మునుపటి రోజులు వచ్చి అంతా సద్దుమణిగింది అనుకున్నప్పుడు మరోసారి వీటిని రివ్యూ చేసి అప్పుడు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఇలా చేయడానికి గల కారణాలు కూడా ఈ గిల్డ్ వివరించింది. ఓవర్సీస్ మార్కెట్ పూర్తిగా జీరో కావడం, థియేటర్లకు ఆక్యుపెన్సీ కేవలం 50 శాతాన్ని మాత్రమే అనుమతించడం, అందులోనూ వచ్చేవాళ్ళు ఎంత ఉంటారో స్పష్టత లేకపోవడం, రెవిన్యూను జెనరేట్ చేసేందుకు తగినన్ని వనరులు లేకపోవడం లాంటివన్నీ సహేతుకంగానే ఉన్నాయి.

ఇవి తక్షణం అమలులోకి రాబోతున్నాయి. ఇప్పటికే మలయాళంలో ఈ తరహా మోడల్ ని కొద్దిరోజుల క్రితమే మొదలుపెట్టారు. ఒకవేళ ఎవరైనా పారితోషికాలు తగ్గించుకోము అంటే వాళ్ళ సినిమాలు హోల్డ్ లో పెట్టే విధంగానూ అక్కడ కఠిన ఆంక్షలు ఉన్నాయి. మరి టాలీవుడ్ లోనూ అలా చేయగలరా లేదా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా పెద్ద ఆర్టిస్టులు, హీరో హీరొయిన్లు వీటికి మద్దతు పలకాల్సిన అవసరం చాలా ఉంది. థియేటర్లకు మునుపటి స్థాయిలో పబ్లిక్ పూర్తిగా వచ్చి హౌస్ ఫుల్ బోర్డులు పడే దాకా దీన్ని భరించక తప్పదు. అందులోనూ వ్యాక్సిన్ ఇంకా రాలేదు. జనంలో భయం పూర్తిగా తొలగలేదు. కేంద్ర ప్రభుత్వం సైతం ఒక్క సినిమా హళ్ళ విషయంలోనే కఠినంగా ఉంది. 2020 పూర్తయ్యేనాటికి ఈ మహమ్మారి తొలగిపోయి అంతా శుభం జరగాలన్నదే ప్రతిఒక్కరి ఆకాంక్ష