iDreamPost
android-app
ios-app

టైటిల్ మార్చిన పోలీస్ శాఖ – Nostalgia

  • Published Nov 01, 2020 | 12:43 PM Updated Updated Nov 01, 2020 | 12:43 PM
టైటిల్ మార్చిన పోలీస్ శాఖ – Nostalgia

ఆ మధ్య తమిళ్ లో వచ్చిన విజయ్ ‘తేరి’ సినిమాను తెలుగులో దిల్ రాజు ‘పోలీసోడు’ పేరుతో డబ్బింగ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ వాడు అని టైటిల్ లో గౌరవం లేకుండా సంభోదించారని డిపార్ట్ మెంట్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో దాన్ని పోలీస్ గా మార్చి రిలీజ్ చేశారు. వచ్చిన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ రావడంతో థియేటర్లలో ఎక్కువ రోజులు నిలవలేదు. దాన్నే పవన్ తోనో రవితేజతోనో రీమేక్ చేయాలని అనుకున్నారు కానీ అదేది కుదరక ఆఖరికి ప్రైమ్ లో ఇటీవలే విడుదల చేశారు. అయితే ఇలాంటి ఉదంతం అందులోనూ పోలీస్ టైటిల్ తో చిక్కులు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ జరిగింది. అదేంటో చూద్దాం.

ముప్పై ఏళ్ళ క్రితం 1990లో నరేష్, సీత జంటగా హాస్య దర్శకులు రేలంగి నరసింహారావు డైరెక్షన్లో బలరాం నిర్మాతగా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీశారు. టైటిల్ ‘పోలీసోడి పెళ్ళాం’. పబ్లిసిటీ కూడా అలాగే చేశారు. టీవీ యాంకర్ అయిన హీరోయిన్ ఓ కానిస్టేబుల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ పై అధికారి ఆయన భార్య చెప్పుచేతల్లో ఉండటం చూసి ఇతగాడు ఆశ్చర్యపోతుంటాడు. కథ అలా మలుపులు తిరిగి మన హీరో శ్రీమతి కలెక్టర్ అవుతుంది. స్టోరీ మొత్తం ఈ రెండు జంటల చుట్టే తిరుగుతుంది. ఆడియో క్యాసెట్లు మార్కెట్ లోకి వచ్చాక పోలీస్ శాఖతో పాటు సెన్సార్ నుంచి అభ్యంతరం వ్యక్తమయింది. మార్చాల్సిందేనని చిన్న పాటి వివాదం రేగింది.

దీంతో ‘పోలీసోడి పెళ్ళాం’ కాస్తా ‘పోలీస్ భార్య’గా మారింది. నిజానికి ఫస్ట్ టైటిల్ లో తప్పేమి లేనప్పటికీ వాడు, పెళ్ళాం అనే పదాలు మరీ ఊర మాస్ గా ఉండటంతో అబ్జెక్షన్ వచ్చింది. దాంతో మార్చక తప్పలేదు. అయితే పోలీస్ భార్య విపరీతమైన పోటీ మధ్య కూడా ఘన విజయం సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ అందుకుంది. ఈ పాత్ర ద్వారా సీత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. గొల్లపూడి, ఆహుతి ప్రసాద్, అంజనా, పొట్టి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఓంకార్ సంభాషణలు బాగా పేలాయి. రాజ్ కోటి సంగీతం, కబీర్ లాల్ ఛాయాగ్రహణం ప్లస్ అయ్యాయి. దీన్నే కన్నడలో రీమేక్ చేస్తే అక్కడా హిట్టు కొట్టింది