iDreamPost
android-app
ios-app

త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు – ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు.

త్వరలో తిరుపతి ఉప ఎన్నికలు – ఎటూ తేల్చుకోలేని చంద్రబాబు.

త్వరలో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలు చంద్రబాబుకు కొత్త తలనొప్పులు తెచ్చాయి. ఒంటరిగా ఎన్నికలకు పోలేక.. జంటకోసం ఎదురుచూడలేక బయటకు చెప్పుకోలేని విరహాన్ని అనుభవిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతికి త్వరలో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. అక్కడ దివంగత ఎంపీ కుటుంబం నుంచి ఒకరికి టికెట్ ఇస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. అయితే ఇప్పుడు అక్కడ పోటీ చేయాలా వద్దా అన్నది చంద్రబాబు తేల్చుకోలేక పోతున్నారు. అలాగని పోటీ చేయకపోతే పరువుపోతుంది. మరోవైపు దుబ్బాకలో సాధించిన అనూహ్య విజయం తెచ్చిన ఆత్మ విశ్వాసంతో బిజెపి మాత్రం తిరుపతి ఎన్నికలకు తాము సిద్ధం అని అంటోంది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఎక్కడా చట్టసభల్లో బోణీ పడలేదు. ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేదు. ఇప్పుడు తిరుపతిలో అదృష్టం కలిసొచ్చి గెలిస్తే వాళ్ళు జాక్ పాట్ కొట్టినట్టే. ఒకవేళ ఓడినా వారికి పోయేదేమి లేదు. అయితే చంద్రబాబు పరిస్థితి మాత్రం అటు ముందుకు పోలేక ఎనక్కి రాలేక కుడితిలో పడిన ఎలకలాగా మారింది.

పోనీ బిజెపికి చేయందిద్దామా!!

పోనీ ఊరకనే ఖాళీగా ఉండడం ఎందుకూ బిజెపికి చేయి అందించి ఆ పార్టీ పెద్దల దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి మళ్ళీ దగ్గరవుదామా అంటే ఇన్నాళ్లూ పొత్తులపెరిట తాను బాగుపడి అధికారంలోకి వచ్చి చివర్లో తమకు చేయిచ్చిన చంద్రబాబు పేరు చెబితేనే బిజెపి నేతలు గుర్రుమంటున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ … తన మంత్రదండంతో “ఛు మంత్రం” అంటూ ఇలా తాకగానే ఎందరినో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులుగా మార్చేసిన చంద్రబాబు తిరుపతి ఎన్నికల్లో ఏం చేయాలో తోచక సతమతమవుతున్నారు. పోనీ బిజెపికి మద్దతు ప్రకటించేసి తాను పోటీకి దూరంగా ఉంటూ గెలిస్తే తన గొప్పతనంగానూ బిజెపి ఓడితే వారి ఓటమిగానూ చూపడానికి స్కెచ్ రెడీ చేస్తున్నా బిజెపి వాళ్ళు మాత్రం ఈయన్ను దగ్గరకు రానిచ్చేలా లేదు. ఈయన లవ్ చేయాలా !! వద్దా!! అని ఊగిసలాడుతూనే వన్సైడ్ లవ్ ట్రాక్ కూడా నడిపేందుకు రెడీగా ఉన్నారు.. మొన్నటిదాకా బిజెపిని మోడీని వెయ్యి మాటలు అనడమే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ నిరసన వ్యక్తం చేసిన నోటితో మళ్ళీ పొత్తుకు సిద్ధం అయితే కార్యకర్తలు, ప్రజలు ఏమనుకుంటారోనన్న భయం కూడా ఆయన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు