iDreamPost
iDreamPost
చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్న తరుణంలో తాజాగా జిల్లా కలెక్టర్ ప్రకటన కలకలం రేపింది. నేరుగా తిరుమలను కూడా కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి తీసుకొస్తూ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీసింది. కలెక్టర్ ప్రకటనపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల నివాస ప్రాంతం కాదని, అయినప్పటికీ కంటైన్మెంట్ చేయాలని నిర్ణయిస్తే రెండు రోజులకు ముందే తమకు సమాచారం అందించాలని కోరింది.
తిరుమలలో గత నెల 8 వ తేదీ నుంచి దర్శనాలు మొదలయ్యాయి. 11 నుంచి సాధారణ ప్రజలు కూడా దర్శనాలకు వస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి అనుగుణంగా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నెల రోజుల్లో ఇప్పటికే 2.5లక్షల మంది దర్శనాలు చేసుకున్నారు. దేశంలోని వివిద ప్రాంతాల నుంచి యాత్రికులు తరలివచ్చారు. అదే సమయంలో తిరుపతి, తిరుమలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆందోళన మొదలయ్యింది.
అలిపిరి వద్దే వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే దర్శనాలకు అనుమతినిస్తున్నారు. అయినా గానీ అర్చకులు, అన్నప్రసాదంలో వంట చేసే సిబ్బంది, విజిలెన్స్ అధికారులు వంటి వారు కూడా కరోనా బారిన పడ్డారు. ఒక్క తిరుమలలోనే 80 కి పైగా కేసులు నమోదయ్యాయి. వారందరినీ క్వారంటైన్ చేసినట్టు టీటీడీ ప్రకటించింది. ఈ పరిణామాలతో టీటీడీని కూడా కంటైన్మెంట్ జాబితాలో చేర్చి చిత్తూరు కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
దానిపై టీటీడీ సీరియస్ అయ్యింది. దిగువన తిరుపతిలో పెరుగుతన్న కేసుల కారణంగా నివాసిత ప్రాంతాల్లో పాజిటివ్ నమోదవుతుంటే తిరుమలను కంటైన్మెంట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. తిరుపతిలో గానీ, తిరుమలలో గానీ కంటైన్మెంట్ జోన్ల విస్తరణ విషయం ముందుకు సమాచారం కూడా లేకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ తన ప్రకటనను సరిదిద్దుతూ తిరుమల కంటైన్మెంట్ పరిధిలో లేదని చెప్పారు. కేవలం తిరుపతిలోని కొన్ని ప్రాంతాలకే అది వర్తిస్తుందని, కొండపైనా అలాంటి కట్టడి లేదని ప్రకటన చేశారు. తాజా ప్రకటన మాత్రం దేశమంతా చర్చనీయాంశం అయ్యింది.