iDreamPost
android-app
ios-app

Times Now – C Voter – బెంగాలీలు మళ్లీ మమతానురాగాలే, తమిళనాట పొద్దు పొడుస్తున్నట్టే

  • Published Mar 09, 2021 | 4:18 AM Updated Updated Mar 09, 2021 | 4:18 AM
Times Now – C Voter  – బెంగాలీలు మళ్లీ మమతానురాగాలే, తమిళనాట పొద్దు పొడుస్తున్నట్టే

దేశంలోని కీలకమైన రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ప్రీ పోల్ సర్వేలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏబీపీ వంటి సంస్థలు వెలువరించిన అంచనాలను తలపించేలా తాజాగా టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే కనిపిస్తోంది. దాదాపుగా అధికార పార్టీలకే మొగ్గు కనిపిస్తోందని సర్వే చెబుతోంది.

బెంగాల్ లో మమతాబెనర్జీ హ్యాట్రిక్ కొడుతుందనే అభిప్రాయం ఈ సర్వేలో వెలువడింది. 2011లో తొలిసారిగా కమ్యూనిస్టుల కోటను బద్ధలు కొట్టిన మమతా బెనర్జీకి ఈసారి కూడా ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్ సభలో మమతా బెనర్జీకి కనీసంగా 146 సీట్లు, అత్యధికంగా 162 స్థానాలు దక్కవచ్చని అంచనా వేశారు. మ్యాజిక్ మార్క్ 147 కాగా మమతా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని టైమ్స్ నౌ – సీ ఓటర్ అంచనా వేసింది.

అదే సమయంలో ఈసారి బెంగాల్ లో పాగా వేయాలని ఆశిస్తున్న బీజేపి మూడంకెల సంఖ్య చేరుకుంటుందని టైమ్స్ నౌ లెక్కలు చెబుతున్నాయి. 99 నుంచి 115 స్థానాల్లో కమల వికాసం ఉంటుందని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. ఆ తర్వాత బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో 18 స్థానాలు గెలిచింది. దానిని ఆసరగా చేసుకుని ఈసారి అసెంబ్లీ వైపు అడుగులు వేయాలని ఆశిస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీ పంచన చేరారు. దాంతో ఆపార్టీ బలం పెరిగింది. అయినా అధికారాన్ని చేరడానికి మరింత సమయం అవసరం అవుతుందనే అంచనా తాజా సర్వే చాటుతోంది.

01-Mar-2021న వచ్చిన C Voter సర్వే చూడండి బిజెపి ను కలవర పెడుతున్న సి ఓటర్ సర్వే

ఇక కాంగ్రెస్- లెఫ్ట్ కూటమికి కేవలం 15 శాతం ఓట్లు 29 నుంచి 37 సీట్లు మాత్రమే దక్కుతాయని చెబుతోంది. దాంతో ఒకనాడు నువ్వా నేనా అన్నట్టుగా తలపడిన పార్టీలు బెంగాల్ లో మూడో స్థానానికి, స్వల్ప సంఖ్య స్థానాలకే పరిమితం అవుతున్నట్టు కనిపిస్తోంది.

మరో కీలక రాష్ట్రం తమిళనాడులో కూడా బీజేపీ ఎత్తులు ఫలించలా లేదు. అక్కడ కూడా అన్నా డీఎంకే సహాయంతో పట్టుసాధించాలని ప్రయత్నించిన కమలనాథుల ఆశలు నెరవేరేలా లేవు.

డీఎంకే వైపు తమిళులు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకపోయినా మళ్లీ డీఎంకే దిశగా తమిళనాడు ప్రభుత్వం సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే అన్ని సర్వేలు అదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. టైమ్స్ నౌ అంచనాల ప్రకారం234 సీట్లున్న సభలో డీఎంకే సారధ్యంలోని యూపీఏ కూటమి 158 సీట్లతో సంపూర్ణ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఎన్డీయే కేవలం 65 సీట్లకు పరిమితం కాబోతోంది.

మలబారు తీరంలో చారిత్రక విజయానికి కమ్యూనిస్టులు కదనోత్సాహంతో సాగుతున్నట్టు చెబుతున్నారు. తాజా సర్వేలో ఎల్డీఎఫ్ కూటమికి 85 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. దాంతో కాంగ్రెస్ నేతృత్వంలోనీ యూడీఎఫ్ 53 స్థానాలకు పరిమితం అవుతుందని చెబుతున్నారు.

18-Feb -2021న వచ్చిన CNX సర్వే చూడండి ఆస‌క్తిక‌ర రిపోర్ట్ : దీదీ హ్యాట్రిక్ సాధించ‌బోతోందా..?

126 స్థానాలున్న అసోంలో కూడా మళ్లీ అధికార కూటమికే స్వల్ప ఆధిక్యత కనిపిస్తోందని చెబుతున్నారు.బీజేపీ 67,కాంగ్రెస్ కూటమి 57 స్థానాలు గెలుస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. వివిధ రకాల ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ మళ్లీ బీజేపీ ప్రభుత్వం గట్టెక్కుతుందని చెబుతున్నారు. కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనిచ్చినా అధికారానికి దూరంగా ఉండబోతోందని చెబుతున్నారు.

కేవలం పాండిచ్చేరిలో మాత్రమే అధికారం మార్పిడి జరిగే అవకాశం ఉంది. ఎన్డీయే ప్రభుత్వం పీఠం వైపు పయనమిస్తున్నట్టు చెబుతున్నారు.30 స్థానాలున్న పుదుచ్చేరిలో బిజెపి-రంగస్వామి కాంగ్రెస్ 18,కాంగ్రెస్-డీఎంకే కూటమి 12 స్థానాలు గెలుస్తాయని టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వే పేర్కొన్నది .

Also Read:అధికారములో ప్రవచనాలు , విపక్ష పాత్రలో పరుష పదజాలం ఇదీ బాబు తీరు ..

మొత్తంగా మూడు రాష్ట్రాలలో అధికార పార్టీలు తిరిగి గెలుస్తాయని ,రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలతాని ఈ సర్వే అంచనా. పోలింగ్ కు మరో నెల కు పైగా సమయం ఉండటంతో పలు సంస్థలు తమ సర్వేలను వెల్లడిచేయటానికి అవకాశం ఉంది. టైమ్స్ నౌ – సీ ఓటర్ మరియు సీ ఓటర్ కూడా మరో సర్వే ను విడుదల చేయవచ్చు. పోలింగ్ ముందు వచ్చే సర్వేలు ఎలా ఉంటాయో చూడాలి…