Idream media
Idream media
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు రోజుల క్రితమే ముగిశాయి. ఫలితాలు నేడో, రేపో విడుదల కానున్నాయి. ఇంతలోనే నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నగారా మోగింది. నోటిఫికేషన్ వచ్చేసింది. సరిగ్గా వచ్చే నెల ఇదే తేదీన (ఏప్రిల్ 17) ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 30న నామినేషన్లకు చివరి రోజు కాగా మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఇప్పటికే అన్ని పార్టీలూ నాగార్జునసాగర్ పై దృష్టి పెట్టాయి. అక్కడ పాగా వేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా తాను బరిలో నిల్చుంటున్నట్లు పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. గత ఎన్నికల్లో జానా రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈసారి ఆయన ముందస్తుగానే ప్రచారం కొనసాగిస్తున్నారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పేరును పార్టీ అధినేత్రి సోనియాగాంధీ గత రాత్రి అధికారికంగా కూడా ప్రకటించారు.
ఈ స్థానంలో గత సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా నోముల నర్సింహయ్య గెలిచారు. అనంతరం ఆయన అకాల మరణం చెందడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో అన్ని పార్టీలూ ఆ స్థానంపై కన్నేశాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించిన విజయాల తర్వాత నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో నెగ్గి మేమే ప్రత్యమ్నాయం అని చెప్పుకోవాలని బీజేపీ యోచిస్తోంది.
అధికార పార్టీ టీఆర్ఎస్ నాగార్జునసాగర్ లో బంపర్ మెజార్టీతో గెలిచి మరోసారి తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ దఫా అక్కడ బహిరంగ సభ లో పాల్గొని ఉప ఎన్నిక లక్ష్యంగా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పలువురు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించి నాగార్జునసాగర్ పై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
ఇదిలా ఉండగా అభ్యర్థి ఎంపికపై సమాలోచనలు జరుగుతున్నాయి.దుబ్బాకలో సోలిపేట రామలింగారెడ్డి భార్యతో పోటీ చేయించినట్లుగా నాగార్జున సాగర్ ఉపఎన్నికలో నోముల సతీమణిని పోటీ చేయించే అవకాశం మీద ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. నర్సింహయ్య తనయుడు భగత్ యాదవ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని, యాదవ సామాజిక వర్గం నుంచే స్థానికుడిని బరిలో దించుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. నరసింహయ్య కుటుంబానికి టికెట్ దక్కని పక్షంలో టికెట్ రేసులో ఎంసీ కోటిరెడ్డి,తేరా చిన్నపరెడ్డి గురువయ్య యాదవ్, మన్నె రంజిత్ యాదవ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో మన్నే రంజిత్ యాదవ్ తాత రామూర్తి యాదవ్ 1994 ఎన్నికల్లో పూర్వ నియోజకవర్గం చలకుర్తిలో టీడీపీ తరుపున పోటీచేసి జానా రెడ్డిని ఓడించాడు.కేటిర్ తో ఉన్న సాన్నిహిత్యం రంజిత్ యాదవ్ కు ఉపయోగపడొచ్చు.
మరోవైపు అభ్యర్థి ఎంపికలో బీజేపీలో తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి.అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కానప్పటికీ.. ఐదుగురు ఆశావహులతో పార్టీ నాయకత్వం విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన నివేదిత, టీడీపీ నుంచి ఏడాది కిందట పార్టీలో చేరిన అంజయ్యయాదవ్‌తో పాటు ప్రముఖ డాక్టర్ రవినాయక్, బాలూనాయక్, ఇంద్రసేనారెడ్డి.. ముఖ్య నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గం కోడలిగా తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. రాష్ట్రంలో ప్రస్తుతం డ్రైనేజీ, శ్మశాన వాటికలు, రోడ్ల పనులన్నీ ఉపాధి హామీ నిధులతోనే జరుగుతున్నాయి. ఈ పనులు జరగడానికి కేంద్రంలోని మోదీ సర్కారు పుణ్యమే అని శ్రీధర్‌రెడ్డి సతీమణి నివేదిత తన భర్తతో కలిసి ఓటర్లను కలుస్తున్నారు.
ఇటీవల మళ్లీ సొంత గూటికి చేరిన విజయశాంతి పేరు కూడా బీజేపీ నుంచి వినిపిస్తోంది. ఇదిలాఉండగా అభ్యర్థి ఎవరనేది పక్కనపెట్టి సమష్టిగా ప్రచారం నిర్వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా నేతలను ఆదేశించారు. అటు టీటీడీపీ కూడా తమ అభ్యర్థిని పోటీలో నిలిపేందుకు ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మిగిలిన పార్టీలు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.తెరాస అభ్యర్ధీ ఎంపిక చేసిన తరువాత బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించవచ్చు.
తెలంగాణలో ఎన్నికలంటేనే ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీలు ఓ రేంజ్ లో ప్రచారం చేస్తున్నాయి. తూటాల్లాంటి మాటలతో ఆయా పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు త్వరలో జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో అంతకు మించిన స్థాయిలో ఆ రెండు పార్టీలు తలపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా.. ప్రస్తుతం నాగార్జున సాగర్ లో ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న జానారెడ్డికి స్థానికంగా మంచి పట్టు ఉంది. సుదీర్ఘకాలం ఆయన ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఉప ఎన్నిక తెలంగాణలో ఆసక్తికరంగా మారింది.