iDreamPost
iDreamPost
నాడు ప్రజాప్రస్థానం పేరిట ప్రజలతో మమేకమవుతూ 59 నియోజక వర్గాల్లో 1470 కిలోమీటర్ల పాటు వైఎస్సార్ చేసిన పాదయాత్ర తర్వాతి రోజుల్లో ప్రజాపాలన వైపు నడిపించాయి.30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి పలు పోరాటాలు ఆందోళనలు చేసిన వైఎస్సార్ జీవితంలో 2003 లో చేసిన పాదయాత్ర మరుపు రాని మైలురాయి .
1999 ఎన్నికల తర్వాత చంద్రబాబు సంస్కరణల పేరిట ప్రజా సంక్షేమాన్ని విస్మరించి విద్యుత్ , బస్ చార్జీలు పెంచటంతో పాటు వరుస కరువులు , అధిక ధరలతో ప్రజలు సతమతమవుతుండగా , మరో వైపు టీడీపీ నాయకుల దోపిడీ పర్వానికి అంతులేకుండా పోయింది . చివరికి పనికి ఆహార పధకం కింద ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా దోచేసి రీ సైకిల్ చేసి తిరిగి సరఫరా చేసిన అంతులేని దోపిడీకి గుర్తుగా ఒక టీడీపీ మంత్రికి బియ్యం రెడ్డి అనే పేరు స్థిరపడిపోయింది . ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రజలను పరామర్శించి వారికి ధైర్యం కల్పించే దిశగా వైఎస్సార్ మొదలుపెట్టిన ప్రజాప్రస్తానంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సమీపంగా గమనించి చలించిపోయారు . ప్రజాప్రస్థానంలో గుర్తించిన పలు రకాల సమస్యల శాశ్వత పరిష్కారానికి తర్వాతి కాలంలో వైఎస్ అమలు చేసిన పలు సంక్షేమ అభివృద్ధి పధకాలకు బీజం పడింది వైఎస్సార్ పాదయాత్రలోనే ….
ప్రజాప్రస్థానం తర్వాత 2004 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన వైయస్సార్ ప్రజాసమస్యల పరిష్కారానికి పలు సంక్షేమ పథకాలు చేపట్టడంతో పాటు 108 , ఆరోగ్య శ్రీ వంటి ప్రజారోగ్య రక్షణ పధకాలు అమలు చేసి ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు . కరువు నివారణకు శాశ్వత పరిష్కారం దిశగా జలయజ్ఞం పేరిట పలు నీటి ప్రాజెక్టులను ప్రారంభించిన వైఎస్సార్ లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతుబాంధవుడు అయ్యారు . 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చామని ప్రస్తుతం అదే హామీలు తప్ప కొత్తగా ఏమీ ఇవ్వట్లేదని తన పనితీరు ప్రతిపాదికగా ఓటేయమని కోరి విజయం సాధించారంటే ఆయన పాలన పట్ల ఆయనకి ఉన్న నమ్మకం , ఆయన పట్ల ప్రజలకి ఉన్న భరోసా అర్ధం చేసుకోవచ్చు .
దురదృష్టవశాత్తు 2009 ఎన్నికల విజయం తర్వాత కొద్ది నెలల్లోనే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ దుర్మరణం చెందిన తర్వాత వైఎస్ కుటుంబం పట్ల , జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం ప్రవర్తనా తీరు మారింది . కాంగ్రెస్ లో ఉన్న కొందరు వైఎస్ వ్యతిరేకులు జగన్ పట్ల అధిష్టానంలో కలిగించిన అపోహలు ఇందుకు కారణంగా చెప్పొచ్చు . వైఎస్ దుర్మరణాన్ని తట్టుకోలేక అశువులు బాసిన వారిని పరామర్శించటానికి జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం మోకాలు అడ్డడంతో పాటు , పలు అంశాలపై వ్యతిరేక దృక్పథంతో వ్యవహరించడాన్ని చూసిన జగన్ ఇహ కాంగ్రెస్ లో ఇమడలేనని బయటికొచ్చి తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యల పై పోరాడుతూ 2014 ఎన్నికలను ఎదుర్కొన్నారు . నాడు విజయం జగన్మోహన్ రెడ్డిదే అని అందరూ ఊహించగా బిజెపి , జనసేనల పొత్తుతో 2 శాతం ఓటింగ్ తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది . ఓటమికి క్రుంగకపోవటం గెలుపుకి పొంగకపోవటం నాయకుని స్థితప్రజ్ఞతకు నిదర్శనం .
2014 లో అనూహ్య ఓటమికి శ్రేణులు కొంత డీలా పడ్డా జగన్ మాత్రం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ప్రతిపక్ష నాయకుని పాత్రలో లీనమయ్యారు . ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీల అమలుకు అసెంబ్లీలో పోరాడిన జగన్ , పంటకు గిట్టుబాటు , రుణమాఫీ వంటి రైతు సమస్యల పై పలు ఆందోళనలు పోరాటం చేశారు . ఈ క్రమంలో జగన్ ని బలహీన పరచటానికి టీడీపీ పలు ప్రయత్నాలు చేయడంతో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలని 23 మందిని కొనుగోలు చేసి తమ పార్టీలో చేర్చుకొని కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది .
అసెంబ్లీలో సైతం ప్రజా సమస్యల పై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వకుండా పదే పదే కట్ చేస్తూ అవమానించడంతో పాటు అధికార పక్ష నాయకులు తీవ్ర పదజాలంతో వ్యక్తిగత దూషణలకు సైతం దిగడంతో ఆ తీరుని నిరసిస్తూ వైసీపీ పార్టీ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించి పలు సమస్యల పరిష్కారానికి ప్రజాక్షేత్రంలోనే ఆందోళనలు చేసి విజయవంతమయ్యారు .ఈ క్రమంలోనే హామీల అమలు పట్ల టీడీపీ మోసాన్ని వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకొనే ప్రయత్నంలో భాగంగా ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్ .
2017 నవంబర్ 6 న ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ఎన్నో మైలు రాళ్లను తన సొంతం చేసుకొంది . తన పై కుట్రపూరితంగా నమోదు చేసిన కేసుల విషయంగా ప్రతివారం కోర్టుకి హాజరు కావాల్సిన పరిస్థితి , ఎన్నికల ముందు రాజకీయ నిర్ణయాలు తీసుకోవాల్సిన వేల యాత్ర కరెక్ట్ కాదు అంటున్న విశ్లేషకుల మాటలు , మరో వైపు జగన్ ఏ జిల్లాలో ప్రవేశిస్తే ఆ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసి నిర్వీర్యం చేస్తామంటూ టీడీపీ నేతలు చేస్తున్న సవాళ్లు .. ఇవేవీ జగన్ సంకల్పాన్ని కదిలించలేక పోయాయి .
టీడీపీ పార్టీ హామీల అమలులో వైఫల్యంతో పాటు ,ప్రజా వ్యతిరేక ధోరణికి , అస్తవ్యస్త విధానాలకు విసిగి వేసారిన ప్రజలు పాదయాత్రలో జగన్ కు బ్రహ్మరథం పట్టారు . ఆ అడుగుని లక్షల పాదాలు అనుసరించాయి . దారి పొడవునా కనపడిన వారిని పలకరిస్తూ , రోడ్ పక్కన పొలాల్లో పనులు చేసుకొనే ఆడపడుచుల కష్టనష్టాలు వింటూ సాగిన జగన్ పాదయాత్ర దారిలో ప్రతి పల్లెలో ఆడుతూ సాగింది . ఆయా గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల వారి ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలు పిల్లల చదువు తీరు తెన్నులూ తెలుసుకొంటూ చేసిన పాదయాత్రలోనే తను గమనించిన ప్రజా సమస్యల పరిష్కారానికి నవరత్నాలు పేరిట సంక్షేమ పథకాలు ప్రకటించిన జగన్ తర్వాతి ఎన్నికల నాటికి వాటికి తుదిరూపునిస్తూ వైసీపీ మేనిఫెస్టోని ప్రజారంజకంగా రూపొందించారు .
పాదయాత్ర మొదలుపెట్టి మరో పదిరోజులకు యాడాది అవుతుందనగా వైజాక్ ఎయిర్పోర్ట్ లో జగన్ పై జరిగిన హత్యాయత్నంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది . వైసీపీ అభిమానులు అదుపు తప్పుతారేమో అనిపించిన వేల జగన్ తాను సంయమనం పాటించటంతో పాటు , ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా తన అభిమానుల్ని , పార్టీ శ్రేణుల్ని సమన్వయం చేసుకొని కంట్రోల్ చేసిన తీరు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు కురిపించింది . హత్యాయత్నం తర్వాత కోలుకునే వరకూ కొంత విరామం తీసుకొని మళ్లీ పాదయాత్ర ప్రారంభించిన జగన్ 14 నెలల పాటు 13 జిల్లాల గుండా 3648 కిలోమీటర్ల దూరం చేసిన తన ప్రజా సంకల్ప యాత్రని ఇచ్ఛాపురంలో ముగించి అందుకు గుర్తుగా 88 అడుగుల పైలాన్ ని ఆవిష్కరించారు . 2019 ఎన్నికల్లో 151 సీట్లతో అద్వితీయ విజయాన్ని నమోదు చేసి అధికార పీఠమెక్కి సంక్షేమ రథసారధిగా , విలేజ్ వలంటీర్ , వార్డ్ సచివాలయం , రైతు భరోసా కేంద్రాల్లాంటి నూతన వ్యవస్థల ఏర్పాటుతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు , కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకొంటూ ప్రజారంజక పాలన అందిస్తున్న జగన్ పాదయాత్ర ప్రారంభించి నేటికి మూడేళ్లు .
పాదయాత్రలు గతంలో చాలా జరిగి ఉండొచ్చు . అవి ఆయా నాయకులకు పేరుని అధికారాన్ని సంపాదించి ఉండొచ్చు . కానీ నాడు ప్రజాప్రస్థానం పాదయాత్ర , నేడు ప్రజా సంకల్ప పాదయాత్ర వైఎస్ రాజశేఖరరెడ్డి , జగన్మోహన్ రెడ్డిలకు అధికారంతో పాటు ప్రజల హృదయాల్లో విశిష్ట స్థానం కల్పించాయి .