iDreamPost
iDreamPost
‘కొత్త నీటి ఉరవడిలకి పాత నీరు కొట్టుకుపోవాల్సిందే’. ఏ రంగానికైనా ఈ సామెత వర్తిస్తుంది. కాని గోదావరి జిల్లాలలో టీడీపీ నాయకత్వంలో ఇది కానరావడం లేదు. కారణాలు ఏమైనా పాతతరం నాయకులే టీడీపీ పల్లకిని మోయాల్సి వస్తుంది. యువత రాజకీయాల్లోకి రావడం తక్కువ అనుకుంటే టీడీపీలో యువ నాయకత్వం పెద్ద లోటుగా మారింది. ఈ కారణంగానే ఆ పార్టీలో నాయకత్వ మార్పు జరిగినా సీనియర్ల స్థానంలో సీనియర్లు వస్తున్నారు కాని యువతరం మాత్రం కనిపించడం లేదు.
ఇందుకు తాజా ఉదాహరణ భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా తోట సీతారామ లక్ష్మి నియామకం. ఆమె ఎంపిక పార్టీ పరంగా సరైనదే అని క్యాడర్ అంటున్నా… ఇప్పటి వరకు ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)ను తప్పించడం వెనుక కారణాలు అనేకం. పార్టీలో ఉండీ లేనట్టుగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌కు పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడంలో భాగంగా అతని వియ్యంకుడు అంజిబాబుకు కత్తెర వేసినట్టు ప్రచారం జరుగుతుంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో రాష్ట్రం ధృష్టిని ఆకర్షించింది. ఇక్కడ పవన్ ఓటమి సైతం పెద్ద సంచలనమైంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మూడవస్థానంలో నిలిచినప్పటికీ మంచి ఓటు సాధించింది. ఈ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జిగా ఇప్పటి వరకు మాజీ ఎమ్మెల్మే అంజిబాబు ఉన్నారు. టీడీపీ అతని స్థానంలో మరో సీనియర్ నేత తోట సీతారామ లక్ష్మిని నియమించారు. ఆమె 2002 నుంచి 2007 వరకు భీమవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
Also Read : సీనియర్లకు షాకిచ్చిన బాబు.. తెర మీదకు కొత్త పేర్లు..
రాజకీయాల్లో చేరిన తొలి రోజుల్లో ఆమె మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఫాలోవర్‌గా ఉండేవారు. ఈ కారణంగానే భీమవరం మున్సిపల్ చైర్మన్ పదవి క్షత్రేయులకు ఇవ్వాలని నాటి ఉండి ఎమ్మెల్యే కలిదిండి అబ్బాయిరాజు పట్టుబట్టినా కాదని సుబ్బారాయుడు తన శిష్యురాలిగా ఉన్న సీతా రామలక్ష్మికి కట్టబెట్టారు. ఆమె కుటుంబం రాజకీయాల్లో రావడం ఇదే తొలిసారి. భర్త తోట సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేయగా, కుమారుడు జగదీష్ ఆక్వారంగంలో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.
2009లో సుబ్బారాయుడు ప్రజారాజ్యంలోకి వెళ్లినా సీతా రామలక్ష్మి టీడీపీలోనే కొనసాగారు. పార్టీ సీనియర్ నేత యర్రా నారాయణస్వామి వర్గంలో కొనసాగారు. 2009లో పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షరాలుగా ఆధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె 2014 అధికారంలోకి వచ్చిన తరువాత వరకు కొనసాగారు.
రాజ్యసభ సభ్యురాలిగా..
సీతా రామలక్ష్మిని 2014 సాధారణ ఎన్నికల ముందు చంద్రబాబు రాజ్యసభకు ఎంపిక చేశారు. గోదావరి జిల్లాల నుంచి కాపులకు అవకాశం వస్తుందని తెలియడంతో రాజ్యసభకు ఆమెతోపాటు రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. సీతారామ లక్ష్మిని పదవి వరించింది. ఇది రాజప్పకు ‘వరం’గా మారింది. తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పెద్దాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం, ఉపముఖ్యమంతి కావడం జరిగింది. 2009లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన ఆమె పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయదురంధరుడు కనుమూరు బాపిరాజు చేతిలో పరాజయం పాలయ్యారు.
Also Read : రాజీనామా చేసిన నెలకే పిలిచి మళ్లీ అదే పదవి.. టీడీపీ దుస్థితికి నిదర్శనం
అంజిబాబును తప్పించి..
భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో అంజిబాబుకు మంచి పట్టు ఉంది. 2009 ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. రాష్ట్ర విభజనతో ఆ పార్టీని వీడి 2014లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా ఆయన ప్రస్తుత భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తిరిగి టీడీపీ తరపున పోటీ చేసినా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇదే నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే.
ఇక్కడ మూడవ స్థానంలో నిలిచినప్పటికీ అంజిబాబు మంచి ఓటింగ్ సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయనకు 54,037 ఓట్లు (28.14 శాతం) ఓట్లు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓటమికి అంజిబాబు కారణమని చెప్పాలి. వపన్ సామాజికవర్గానికి చెందిన అంజిబాబు అంచనాలకు మించి తెచ్చుకున్న ఓటింగ్ పవన్ కొంపముంచింది. నియోజకవర్గం మీద పట్టు ఉన్నప్పటికీ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అంజిబాబు ప్రతిపక్షంలో ఉండలేరని, ఆయనకు అదే పెద్ద బలహీనత అని సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నారు.
ఇదే సమయంలో అంజిబాబు వియ్యంకుడు, విశాఖకు చెందిన మాజీమంత్రి గంటా శ్రీనివాస్‌ను రాజకీయంగా నామమాత్రం చేసే పనిలో అంజిబాబు ఇన్‌చార్జి పదవికి ఎసరు పెట్టారనే ప్రచారం సాగుతుంది. అయితే ఆయన స్థానంలో సీతాదేవిని ఎంపిక చేయడం ద్వారా పార్టీకి కొంత వరకు మేలు జరుగుతుందని క్యాడర్ భావిస్తుంది. కాని భీమవరంలో వైఎస్సార్‌సీపీ హవా నడుస్తుంది. తరువాత స్థానంలో జనసేన ఉంది. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో భీమవరం మండలం వైఎస్సార్‌సీపీ గెలుచుకోగా, వీరవసరం ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు జనసేన దక్కించుకున్నాయి. టీడీపీ నామమాత్రం కూడా పోటీ ఇవ్వలేదు. పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సమయంలో సీతారామలక్ష్మి ఎలా నెట్టుకు వస్తారనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read : గంటాపై టీడీపీ ఆశలు వదులుకుందా?