Idream media
Idream media
సరిగ్గా 15రోజుల క్రితం వచ్చిన రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల గుండెల్లో పరుగెడుతున్నాయి. 14 రోజులు దాటడంతో ఎంత వేగంగా పరుగెడుతున్నాయో ఊహకే అందని పరిస్థితి..
ముందుగా తెలంగాణ ట్రైన్ గురించి చూద్దాం..
ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ గురించే ఇప్పుడు తెలంగాణ యంత్రాంగం చర్చిస్తోంది. ఎందుకంటే ఆ ట్రైన్‌లోనే కరోనా సోకిన వ్యక్తి ప్రయాణించాడు. అసలు ఆ ట్రైన్ లో ఏయే బోగీల్లో ఎవరెవరు ప్రయాణించారు..? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు.? కరోనా సోకిన వ్యక్తి ట్రైన్‌లో ప్రయాణిస్తూ ఎవరెవరితో మాట్లాడారు..? అనే వివరాలు పరిశీలిస్తున్నారు. మార్చి 14, 2020. ఉదయం 7.10 గంటలకు ట్రైన్ నెంబర్ 12708 ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ఢిల్లీనుండి బయల్దేరింది.
కరోనా వైరస్ సోకిన వ్యక్తి అదే ట్రైన్ లోని ఎస్ 9 బోగీ ఎక్కారు.. ట్రైన్ రాష్ట్రాలు దాటుకుంటూ ఉదయం 5గంటల 9 నిమిషాలకు తెలంగాణలోని రామగుండం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ వైరస్ సోకిన వ్యక్తి కి దగ్గు, జ్వరం, జలుబు పట్టుకున్నాయి. దాంతో అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం అలెర్టయ్యింది. మార్చి 15న ఎస్-9బోగీలో ప్రయాణం చేసిన వ్యక్తుల వివరాలపై దృష్టి పెట్టింది. ట్రైన్‌లో ప్రయాణించే సమయంలో కరోనా బాధితుడు ప్రయాణించిన బోగీలో 82 మంది ప్రయాణికులున్నారని గుర్తించగా వీరిలో 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
వారు ప్రయాణించిన రైలుతో పాటు, ఎక్కడెక్కడ తిరిగారు ఎవరిని కలిశారనే దానిపై వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా వారి వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు రైల్వే అధికారులు అందించారు. ఢిల్లీ నుంచి రైలు మార్గంలో రామగుండం, అక్కడి నుంచి కరీంనగర్ కు చేరుకున్నారు. వీరితో పాటు మరో 20 మంది వచ్చినట్లు తెలుస్తోంది. వారిలో 10మంది రామగుండం నుండి జగిత్యాలకు వెళ్లారని సమాచారం రాగా వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసారు. టికెట్లు రిజర్వ్ చేసుకునే సమయంలో అందించిన ఫోన్ నంబర్ల ద్వారా ప్రయాణికులను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత రైలు తిరుపతి వరకు వెళ్లింది. అంటే ఆ బోగీలో తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారని తెలుస్తోంది.
ఇప్పుడు ఏపీ ట్రైన్..
ఈ ట్రైన్ కు ఏకంగా కరోనా ట్రైన్ గా పేరు పెట్టేసారు. ఈ నెల 15న ఈ ట్రైన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సుమారుగా 15 వందలమంది సామూహికంగా ఓ మత పరమైన ప్రార్థనల కోసం ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మసీదులో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాదులో 300 మందిని, విజయవాడ, గుంటూరుల్లో కొందరిని, చీరాలలో 80 మందిని, ఒంగోలులో 200 మందిని దింపినట్టు సమాచారం. వీళ్లే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెఎక్కడో చాలామంది దిగారట. విదేశాలనుంచి వచ్చినవారి అడ్రస్లు ఎయిర్ పోర్ట్ ద్వారా సేకరించారు. కానీ ట్రైన్ లో ప్రయాణించిన వారి వివరాలు సేకరించటం సవాల్ గా మారింది.
వీరి అడ్రస్ ల కోసం ఇప్పుడు అధికారులు జల్లెడ పడుతున్నారు. చీరాల నవాబ్ పేట మరియు పేరాల మసీదు సెంటర్ దగ్గర అక్కడకు వెళ్ళి వచ్చిన వారున్నారట.. విదేశాల నుండి వచ్చి క్వారంటైన్ లో ఉన్నవారికి రిపోర్టు లు నెగిటివ్ రాగా డిల్లీ నుంచి వచ్చిన వారివి మాత్రం కచ్చితంగా పాజిటివ్ వస్తున్నాయి. ఇప్పటివరకూ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, మాచర్ల, చీరాలలో నమోదవుతున్న కేసులు అవే. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరాలు తెలపాలని అధికారులు కోరుతున్నారు.
అయితే ఏపీలో మాత్రం కరోనా పొజిటివ్ కేసులు నమోదు కావడట్లేదు.. ఆదివారం రాత్రినుంచి చేసిన 68 శాంపిల్స్ లో 66 నెగిటివ్, 2 మాత్రమే పాజిటివ్ వచ్చాయి. అవి కూడా ఒకటి కాకినాడ, ఒకటి రాజమండ్రిలో వచ్చాయి. వీరిద్దరూ ఢిల్లీలోని మతపరమైన సమావేశానికి హాజరై తిరిగి వచ్చిన వ్యక్తులుగా గుర్తించారు. ఢిల్లీలోని ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన దాదాపుగా 1500 మంది కోసం ఏపీ పోలీసులు, అధికారులు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు విస్తృతగా గాలిస్తున్నారు. ఇప్పటివరకూ మొత్తం 23మాత్రమే పాజిటివ్ కేసులు నమోదవగా ఇద్దరికి పూర్తిగా నయమైంది. అయితే ఢిల్లీలోని సదరు కార్యక్రమంలో పాల్గొన్న చాలామందికి కరోనా రావడంతో ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గట్టి సవాల్ ఎదురైనట్టైంది.