iDreamPost
iDreamPost
మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసిఫర్ రీమేక్ కి ఫైనల్ గా మోహన్ రాజాని దర్శకుడిగా లాక్ చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టబోతున్నారు. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఆచార్య పూర్తయ్యాకే ఉంటుంది. దీనికి సంబంధించిన క్యాస్టింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. హనుమాన్ జంక్షన్ తర్వాత చాలా గ్యాప్ తో చేస్తున్న మూవీ కావడంతో మోహన్ రాజా ఎలాగైనా గట్టి బ్లాక్ బస్టర్ అందించాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం. గతంలో సుజిత్, వివి వినాయక్ లు దీని మీద వర్క్ చేసినప్పుడు సంతృప్తి పడని చిరు ఫైనల్ గా మోహన్ రాజాకు ఓకే చెప్పడం ఆశ్చర్యమే.
ఇదిలా ఉండగా ఇందులో కీలకమైన పాత్రకు రమ్యకృష్ణను ఫైనల్ చేయొచ్చని ఇన్ సైడ్ టాక్. ఇది హీరోకు సోదరి వరసలో ఉంటుంది. చాలా డెప్త్ ఉన్న ఈ క్యారెక్టర్ ని మలయాళంలో మంజు వారియర్ అద్భుతంగా పోషించారు. ఈ రోల్ ఏ మాత్రం అటుఇటు అయినా తేడా కొట్టేస్తుంది. అందుకే రమ్యకృష్ణ తప్ప ఎవరూ న్యాయం చేయలేరని భావించి ఆమెనే ట్రై చేస్తున్నట్టు వినికిడి. చిరుతో ఆవిడ నటించి 21 ఏళ్ళు దాటింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి మూవీ 1999లో విడుదలైన ఇద్దరు మిత్రులు. అంతకు ముందు ముగ్గురు మొనగాళ్లులో కూడా కలిసి నటించారు. అల్లుడా మజాకా ఒకటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
మరి రమ్యకృష్ణ చిరుకి సోదరి అంటే ప్రేక్షకులు ఒప్పుకుంటారా అనే సందేహం రావొచ్చు. అయితే ఇక్కడో విషయం మర్చిపోకూడదు. రమ్యకృష్ణ చిరుకి ఎప్పుడో చెల్లిగా నటించింది. ముప్పై మూడేళ్ళ క్రితం రిలీజైన చక్రవర్తిలో ఇద్దరూ అన్నా చెల్లెలుగా కనిపిస్తారు. అప్పటికి ఇంకా ఇమేజ్ రాని రమ్యకృష్ణ సపోర్టింగ్ రోల్స్ చేసింది. ఆ తర్వాతే చిరంజీవికి జోడిగా మారింది. సో లూసిఫర్ రీమేక్ కి తనను తీసుకుంటే ప్లస్ అవుతుందే తప్ప మైనస్ కాదు. అంతేకాదు ఒరిజినల్ వెర్షన్ లో లేని ఇలియానాను ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. మరికొన్ని అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయి.