Idream media
Idream media
తిరుపతి కార్పొరేషన్‌కు జగన్ సర్కార్ హయాంలోనైనా ఎన్నికలు జరిగేనా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. 12 ఏళ్లుగా ఎన్నికలకు నోచుకోకపోవడంతో నగరాభివృద్ధి కుంటుపడిందనే వాదన వినిపిస్తోంది. 2002లో చివరిసారిగా తిరుపతి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేత కందాటి శంకర్‌రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2007లో ఎన్నికలు జరగాల్సింది.
2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ వైఎస్సార్ హయాంలో 2007, మార్చి2న తిరుపతి మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పట్లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. అయితే తిరుపతి మేయర్ పదవి ఎస్టీకి కేటాయించడంతో సమస్య తలెత్తింది. తిరుపతిలో ఎస్టీల జనాభా వెయ్యికి లోపేనని, అలాంటిది వారికి మేయర్ పదవి ఎలా రిజర్వ్ చేస్తారని కొందరు కోర్టును ఆశ్రయించారు. అలాగే గ్రేటర్ తిరుపతి, వార్డుల రిజర్వేషన్ తదితర అంశాలపై కోర్టు తలుపులు తట్టారు.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగకపోవడానికి అనేక కారణాలున్నాయి. తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిగి మేయర్ వస్తే, ఎమ్మెల్యేను డామినేట్ చేస్తాడనే కుట్రతో కూడా ఎన్నికలకు పోలేదనే వాదన ఉంది. తిరుపతి కార్పొరేషన్‌కు 12 ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3600 కోట్ల నిధులు నిలిచిపోయినట్టు సమాచారం. ఎన్నికలు జరిగి ఉండింటే ఈ నిధులు మంజూరై నగరం ఎంతో అభివృద్ధి సాధించేదనడంలో ఎలా సందేహం లేదు.
తిరుపతి కార్పొరేషన్ 12 ఏళ్లుగా IAS అధికారి పాలనలో ఉంది. రాష్ట్రంలో మిగిలిన కార్పొరేషన్లతో పాటు తిరుపతి కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ పలుమార్లు చెప్పారు. దీంతో నగరవాసుల్లో ఆశలు చిగురించాయి. తిరుపతి ఎమ్మెల్యేగా వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తనయుడు భూమన అభినయ్‌రెడ్డి ప్రతివార్డులో పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చొరవ చూపుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలకు వైసీపీ వార్డు నాయకులను వారు సన్నద్ధం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండటంతో కార్పొరేషన్ బరిలో దిగేందుకు ఆ పార్టీ నేతలు ఉత్సాహం చూపుతున్నారు.
12 ఏళ్ల తర్వాతైనా తిరుపతి కార్పొరేషన్‌కు ఏ మాత్రం ఎన్నికలు జరుగుతాయో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.