ఇప్పుడు టాలీవుడ్ లో ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి హాట్ టాపిక్ గా మారింది. ఇంకా మొదటి సినిమా విడుదల కాకుండానే, దాని ఫలితం తెలియకుండానే వరస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్థాయికి చేరుకుంటోంది. కేవలం చిన్న చిన్న ప్రోమోలు వీడియోలు తప్ప నిజంగా తన పెర్ఫార్మన్స్ ఎలా ఉంటుందో ఎవరికీ ఇంకా పూర్తి అవగాహన లేదు. అలాంటిది ఇంత తక్కువ టైంలో ఈ రేంజ్ లో క్రేజ్ రావడం అంటే మాటలు కాదు. అసలే టాలీవుడ్ లో విపరీతమైన హీరోయిన్ల కొరత. దశాబ్దాలుగా పాతుకుపోయిన వాళ్లనే మళ్ళీ మళ్ళీ తీసుకోవాల్సి వస్తోంది. అలాంటి సమయంలో కృతి శెట్టి ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తోంది.
అసలు ఈ శెట్టి పదంలోనే ఏదో మేజిక్ ఉన్నట్టుంది. నాగార్జున సూపర్ తో తెరంగేట్రం చేసిన అనుష్క ఇంటి పేరు కూడా శెట్టినే. 15 ఏళ్ళు ఇండస్ట్రీలో నిలబడిపోయింది. అరుంధతి లాంటి సినిమాలతో తన స్టేచర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. కాకతాళీయంగా కృతి శెట్టి, అనుష్క శెట్టి ఇద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్లే. విచిత్రంగా ఇద్దరికీ తెలుగులోనే బ్రహ్మాండమైన ఆఫర్లు దక్కుతున్నాయి. టాప్ టూలో ఉన్న రష్మిక మందన్న కూడా అదే స్టేట్ అన్న సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. సాయి పల్లవి లాంటి మలయాళీలు, ఇలా కన్నడ శెట్టిలు మనదగ్గర గట్టిగానే నిలబడిపోతున్నారు. టాలెంట్ ఉంటే పట్టేసుకోవడం మనవాళ్ళ తర్వాతే ఎవరైనా.
కృతి శెట్టి ప్రస్తుతం నానితో శ్యామ్ సింగ రాయ్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప్పెన ప్రమోషన్లు కాగానే అందులో జాయిన్ అవుతుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాలో కూడా తనే మెయిన్ లీడ్. ఇవి కాకుండా నాగ శౌర్య ప్రాజెక్ట్ కూడా ఒకటి ప్రతిపాదన స్టేజి లో ఉంది. కోలీవుడ్ నుంచి సూర్య సినిమాలో ఛాన్స్ వచ్చిందనే టాక్ కూడా తాజాగా హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ఉప్పెన కనక బ్లాక్ బస్టర్ అయితే తనను పట్టడం కష్టమే అనేలా ఉంది. మొత్తానికి కన్నడలో ఇంకెవరైనా శెట్టి హీరోయిన్లు ఉంటే ఇక్కడికి వచ్చేస్తే త్వరగా సెటిలై పోవచ్చు