iDreamPost
iDreamPost
సంప్రదాయ సినిమా ఫార్ములాలో హీరో మంచివాడు విలన్ చెడ్డవాడు. అంతే. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. పాతాళభైరవి నుంచి సరిలేరు నీకెవ్వరు వరకు చూసుకుంటే ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. అయితే దానికి భిన్నంగా అసలు హీరోనే లేకుండా విలన్ పాత్ర మాత్రమే ఉంటే. దాన్ని ప్రేక్షకులు ఆదరించగలరా. అసలు ఆ ఆలోచనే రిస్క్ అనిపిస్తుంది కదూ. కానీ 1993లో అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన ‘బాజిగర్’ ఈ సూత్రాన్ని తిరగరాసి ఓ సరికొత్త అనుభూతిని అందించింది. తండ్రి చావుకు కారణమై ధనవంతులైన తన కుటుంబాన్ని వీధుల పాలు చేసిన విలన్ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం హీరోనే విలన్ గా మారి అమాయకురాలైన అతని కూతురిని హత్య చేసి దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని దుర్మార్గాలు చేసే పాత్రలో షారుఖ్ ఖాన్ విశ్వరూపానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
దాంతో బాజీగర్ కాసుల వర్షం కురిపించి కొత్త రికార్డులు నమోదు చేసింది. ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం పట్ల ట్రేడ్ సైతం షాక్ తింది. దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి.దీని కోసం ముందుగా అనుకున్న హీరోలు అక్షయ్ కుమార్, అర్బాజ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్. మరీ నెగటివిటీ ఎక్కువైపోయిందని వాళ్లంతా వద్దన్నారు. ముందు ఇద్దరు హీరోయిన్లకు బదులు శ్రీదేవితో డ్యూయల్ రోల్ చేయించాలనుకున్నారు. కానీ జనం రిసీవ్ చేసుకోరని 18 ఏళ్ళ ప్రాయంలో ఉన్న కాజల్, శిల్పా శెట్టిని ఎంచుకున్నారు. నిజానికిది సొంత కథ కాదు. 1991లో వచ్చిన హాలీవుడ్ మూవీ ‘ఏ కిస్ బిఫోర్ డైయింగ్’ ఆధారంగా రాసుకున్నారు. దీనికి కేవలం 42 రోజుల గ్యాప్ లో ఇలాంటి పాత్రే షారుఖ్ పోషించిన డర్ కూడా బ్లాక్ బస్టర్ కావడం విశేషం.
ఇది శిల్పాశెట్టి డెబ్యూ మూవీ. అప్పుడు తన వయసు 17 ఏళ్ళు. ఊహించని రీతిలో బాజిగర్ ఆ ఏడాది భారీ పోటీని తట్టుకుని అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా స్థానం సంపాదించుకుంది. బెస్ట్ యాక్టర్ గా షారుఖ్ ఖాన్ తో పాటు ఎన్నో ఫిలిం ఫేర్ పురస్కారాలు దీనికి దక్కాయి. అప్పటిదాకా సెటిల్ కావడానికి కష్టపడుతున్న షారుఖ్ ఖాన్ దెబ్బకు స్టార్ అయిపోయాడు. తెలుగులో రాజశేఖర్ తో తమ్మారెడ్డి భరద్వాజ ఎంతో ముచ్చటపడి వేటగాడు పేరుతో రీమేక్ చేస్తే డిజాస్టర్ అయ్యింది. అల్లరి ప్రియుడు, అంకుశం లాంటి పాత్రల్లో చూసిన యాంగ్రీ మ్యాన్ ని ఈ వేషంలో చూడలేకపోయారు. సౌందర్య, రంభ హీరోయిన్లుగా నటించగా శ్రీకాంత్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇలా బాలీవుడ్ హిస్టరీలో బాజీగర్ తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని దక్కించుకుంది.