Idream media
Idream media
కొవిడ్ రెండో వేవ్ తుపానులా విరుచుకుపడుతోందని.. ఈసారి అది మరింత తీవ్రమైన సవాలు విసురుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కొన్నాళ్లుగా కఠినమైన పోరాటం చేస్తున్నామని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి మనం తప్పక బయటపడాలన్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడారు.
తుపానులా విరుచుకుపడుతోంది
కొన్ని వారాల క్రితం కరోనా సెకండ్ వేవ్ దూసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. రెండో దశలో కరోనా మరింత తీవ్రమైన సవాలు విసురుతోందని, తుపాను వలె విరుచుకుపడుతోందని చెప్పారు. కరోనా సంక్షోభం నుంచి తప్పక భయపడాల్సిన పరిస్థితులున్నాయన్నారు.
దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత
దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత ఉందని మోదీ అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరా కోసం అనేక చర్యలు తీసుకున్నామని, అనేక ప్లాంట్లు నెలకొల్పామని గుర్తు చేశారు. వైద్య అవసరాల కోసం ఔషధాల ఉత్పత్తి పెంచామని , ఫార్మా పరిశ్రమలు త్వరిత గతిన మెరుగైన వ్యాక్సిన్లు అందిస్తున్నాయని చెప్పారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని చెప్పారు.
దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడాలి
దేశాన్ని లాక్‌డౌన్ నుంచి కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను చివరి అస్త్రంగానే పరిగణించాలన్నారు. మర్యాద పురుషుడు శ్రీరాముడు చెప్పినట్లు కరోనా నియమాలు పాటించాలన్నారు.