iDreamPost
android-app
ios-app

థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ : అధికారికం

  • Published Sep 30, 2020 | 3:26 PM Updated Updated Sep 30, 2020 | 3:26 PM
థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ : అధికారికం

కల నిజమాయెగా అని పాడుకోవాల్సిన టైం వచ్చేసింది. సినిమా ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేటర్ల ఓపెనింగ్ కు అక్టోబర్ 15 ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆదేశాలు వచ్చేశాయి. కానీ 50 శాతం అక్యుపెన్సీకి మాత్రమే అనుమతి ఇస్తూ మెలిక పెట్టారు. ఇదిముందు నుంచి ఊహిస్తున్నదే.  గుడ్డి కన్నా మెల్ల నయం తరహాలో ఇప్పటికే కుదేలైపోయి ఆలో లక్ష్మణా అంటున్న థియేటర్ల వ్యవస్థకు ఇది ఖచ్చితంగా ఊరట కలిగిస్తుంది. చేతిలో ఇంకా రెండు వారాలు సమయం ఉంది కాబట్టి హాళ్లను శుభ్రపరిచి మెషినరీని చెక్ చేసుకుని ప్రొజెక్టర్లు వగైరా అన్ని సిద్ధం చేసుకునే దిశగా సిబ్బంది రేపటి నుంచి రంగంలోకి దిగబోతున్నారు. 

మల్టీ ప్లెక్సులు ఎప్పటి నుంచో ఏర్పాట్లు చేసుకుని ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక సింగల్ స్క్రీన్లు ముస్తాబు చేయడానికి పెద్ద సమయం పట్టదు. అయితే మొదటి విడత నేరుగా కొత్త సినిమాలు వచ్చే అవకాశాలు తక్కువే. టెనెట్ లాంటి హాలీవుడ్ మూవీస్ లేదా గతంలో ఆడిన తెలుగు బ్లాక్ బస్టర్లతో కొంత కాలం వెళ్లదీయాల్సిందే. ఎందుకంటే రెవిన్యూ కోణంలో చూసుకుంటే ఇలా సగం నిండిన హాళ్ళతో వాళ్ళ పెట్టుబడులు వెనక్కు రావు. చిన్న బడ్జెట్ సినిమాలకు ఇబ్బంది లేదు కానీ స్టార్లు ఉన్న చిత్రాలను మాత్రం ఎవరూ రిస్క్ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏదో ఒకటి ఆరు నెలల నిరీక్షణకు బ్రేక్ పడింది. థియేటర్ల గేట్లు తెరుచుకోబోతున్నాయి. 
భౌతికంగా టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉండకపోవచ్చు. కేవలం ఆన్ లైన్ ద్వారానే జారీ చేసే విధంగా నిబంధనలు ఉండబోతున్నాయి. అయితే ఈ ఫిఫ్టీ పర్సెంట్ రూల్ ఎంత కాలం ఉంటుందన్నది అక్టోబర్ చివరికి గాని స్పష్టత రాదు. పరిస్థితి చూస్తుంటే కనీసం నవంబర్ కూడా ఇదే తరహాలో కొనసాగించే అవకాశం ఉంది. కొత్తదో పాతదో ముందైతే ఏదో ఒక బొమ్మ తెరమీద పడితే ఇన్నేళ్ల విరహాన్ని తీర్చుకుంటామని మూవీ లవర్స్ అంటున్నారు. కనీసం ఆ సగం సీట్లైనా నిండితే సంతోషమే. లేకపోతే చాలా థియేటర్లకు మళ్ళీ మెయిన్టెనెన్స్ అనే కొత్త సమస్య తలెత్తుంది. కొద్ది రోజులు పరిశీలించాకే దీని తాలుకు పరిణామాలను బట్టి భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు.  సో ఎప్పటిలాగే వెండితెరపై వినోదానికి సిద్ధం కండి మరి.