iDreamPost
android-app
ios-app

సోము వీర్రాజు మాట నిలబెట్టుకుంటారా..?

సోము  వీర్రాజు మాట నిలబెట్టుకుంటారా..?

మతాలు ఏవైనా, దేవుడు ఎవరైనా.. ఆయా మతాలు, దేవుళ్లు, దేవతలపై ప్రజలకు ఉండే విశ్వాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. తాము ఆరాధించే దైవం జీవితంలో తమను ముందుకు నడిపిస్తారనే ప్రగాఢ విశ్వాసం ప్రజలకు ఉంటుంది. ఏ మాతాల వారికైనా ఇందులో మరో ఆలోచన లేదు. దేవుడు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలతో ఆయా వర్గాల ప్రజలకు ఆధ్యాత్మిక, మానసిక అనుబంధం ఉంటుంది. మనోభావాలకు సంభందించిన విషయంలో జరిగే అపరాథం ఏదైనా వారి మనస్సుల్లో అశాంతిని రేకెత్తిస్తుంది. అనుకోకుండా జరిగే ఘటనలతోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక ఏదైనా లక్ష్యంతో దేవుళ్ల పట్ల అపచారాలు జరిగితే.. ఆయా వర్గాల ప్రజల మానసిక సంఘర్షణను మాటల్లో వర్ణించలేం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఈ కోవకే చెందుతాయి.

ఇలాంటి ఘటనలు జరగకూడదనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎవరు..? ఏ లక్ష్యంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నా… ప్రజలను తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తున్నాయి. ప్రజల్లో నెలకొన్న అలజడిని తగ్గించేలా, వారి నమ్మకాలను నిలబెట్టేలా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ ఏపీలోని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం.. ఈ ఘటనలను రాజకీయం చేస్తుండడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విజయనగరం రామతీర్థంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన హల్‌చల్‌ ఇంకా గుర్తుంది. అదే సమయంలో హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ.. ఈ విషయాన్ని తాము రాజకీయ కోణంలో తీసుకోవడం లేదని ప్రకటించడం అభినందనీయం. ప్రజల మనోభావాలను, వారి నమ్మకాలను కాపాడే లక్ష్యంతో రామతీర్థం ఘటన పట్ల తాము వ్యవహరిస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం విశేషం.

అయితే చేసిన ప్రకటనకు తగినట్లుగానే సోము వీర్రాజు వ్యవహరించాల్సి ఉంది. ప్రజలల్లో నమ్మకాన్ని నిలబెట్టేందుకు, వారి మనస్సుల్లో శాంతిని నింపేలా సోము వీర్రాజు పని చేయాల్సి ఉంది. హిందుత్వాన్ని భుజానికెత్తుకునేందుకు టీడీపీ ప్రయతాలు చేస్తున్నా.. ఈ విషయంలో బీజేపీదే పెటేంట్‌ రైట్‌ అని చెప్పవచ్చు. ఆ బాధ్యతతో రామతీర్థం ఘటనపై ఆచితూచి స్పందించాలి. దోషులను వేగంగా పట్టుకుని శిక్షించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కూడా కోరాలనే సూచనలు చేయాలి. అయితే క్షేత్రస్థాయి అందోళనలు చేయడం ద్వారా రాజకీయాలు దేవుడి చుట్టూ తిరుగుతున్నాయి.

ఈ రోజు బీజేపీ తన మిత్రపక్షమైన జనసేనతో కలసి నిర్వహించిన రామతీర్థం ధర్మయాత్ర ప్రజల్లో నెలకొన్న అశాంతిని తగ్గించేలా లేదు. సున్నితమైన అంశంలో సోము వీర్రాజు ఆచితూచి నిర్ణయాలు తీసుకుని వ్యవహరించాల్సి ఉంది. అనుమతి లేదని పోలీసులు చెప్పిన వెంటనే వెనక్కి తగ్గితే.. రామతీర్థం ఘటనను తాము రాజకీయ కోణంలో తీసుకోవడంలేదని తాను చేసిన ప్రకటనపై సోము వీర్రాజు నిలబడినవారవుతారు. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సీఐడీ విచారణకు ఆదేశించింది. పోలీసులు ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. అతి త్వరలో నిందితులను పట్టుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ ఘటన పూర్వాపరాలు వెల్లడవుతాయి. ఆ తర్వాత ఎవరికి జరగాల్సిన నష్టం వారికి జరుగుతుంది. అప్పటి వరకు ఉద్రిక్తలకు తావులేకుండా, శాంతిని పెంపొందించేలా, ధర్మపరిరక్షణే ధ్యేయంగా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీలు పని చేయాల్సి ఉంది.