Idream media
Idream media
ఏ నిర్మాణమైన నాణ్యత లోపం ఉంటే వెంటనే కూలిపోతుంది. ఖర్చు పెట్టిన ఖర్చుకు తగ్గట్టుగా ఆ నిర్మాణం దశాబ్దాల కాలం శిధిలావస్థకు చేరకుండా ఉండాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మూడు రోజుల ముచ్చటగా ఉండకూడదు. దానివల్ల రాష్ట్రానికి నష్టం. అయితే ఇటీవలి ఒక రాష్ట్రంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన బ్రిడ్జి నెల రోజుల్లోనే కూలిపోవడం సర్వత్రా విమర్శలకు గురవుతోంది.
నదిపై వంతెన నిర్మాణంలో నాణ్యత లోపాల వల్ల వరద నీటికి కూలిన ఘటన బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో వెలుగుచూసింది. గండక్ నదిపై సత్తర్ ఘాట్ వద్ద వంతెన నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఈ వంతెనను గత నెల 16వతేదీన బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. సిఎం ప్రారంభించిన నెల రోజులకే బ్రిడ్జి వరద నీటికి కూలిపోయిన ఘటన సంచలనం రేపింది.
పలు జిల్లాలను కలిపే ఈ వంతెన వరద నీటికి దెబ్బతిని కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన దెబ్బతిని కూలిపోయిన ఘటనను పరిశీలించేందుకు అభయ్ కుమార్ ప్రభాత్ నేతృత్వంలోని ఇంజనీర్ల బృందం అక్కడకి వెళ్లింది. సివాన్, శరణ్ జిల్లాల్లోని తూర్పు చంపారన్ నుంచి గోపాల్ గంజ్ ల మధ్య దూరం తగ్గించేందుకు గండక్ నదిపై వంతెనను రూ.263.48 కోట్లతో నిర్మించారు. ఈ వంతెన వరదనీటి ధాటికి కొట్టుకుపోయింది.
నాణ్యత లోపాల వల్లనే వంతెన ప్రారంభించిన నెలరోజులకే కొట్టుకుపోయిందని రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్ ఆరోపించారు. నాసిరకంగా వంతెన పనులు చేసిన కాంట్రాక్టరును బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమాల వల్లనే బ్రిడ్జి కూలిందని ఆయన ఆరోపించారు.