iDreamPost
iDreamPost
అల్లుడు శీను లాంటి భారీ వెంచర్ తో వివి వినాయక్ దర్శకత్వంలో డెబ్యూ చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి భారీ హిట్టు కోసం చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. రీమేక్ రాక్షసుడు రూపంలో అది వచ్చే దాకా ఎదురు చూపులు తప్పలేదు. అయితే ఊర మసాలా కంటెంట్ తో చేసే ఇతని సినిమాలు హిందీ డబ్బింగ్ రూపంలో నార్త్ లో మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాయి. సాక్ష్యం, కవచం లాంటి డిజాస్టర్లు సైతం మిలియన్ల వ్యూలతో టీవీ ఛానల్స్ టిఆర్పి రేటింగ్లతో అదరహో అనిపించాయి. దెబ్బకు ఇతని సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడే అక్కడి నిర్మాతలు హక్కుల కోసం ఎగబడటం మొదలైంది.
ఇది చూసే కాబోలు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేయొచ్చనే కాన్ఫిడెన్స్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 15 ఏళ్ళ క్రితం వచ్చిన రాజమౌళి బ్లాక్ బస్టర్ ఛత్రపతి రీమేక్ తో అక్కడ అడుగు పెట్టబోతున్నాడన్న వార్త గత మూడు రోజులుగా ఫిలిం నగర్ హాట్ టాపిక్ గా మారింది. కారణం ఉంది. టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ జెండా గట్టిగా పాతిన హీరో ప్రభాస్ ఒక్కడే. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్లు సైతం కొన్ని ప్రయత్నాలు చేసి అక్కడ వర్కౌట్ కాదని గుర్తించి వెనక్కు వచ్చి బుద్ధిగా తెలుగు సినిమాలు చేసుకుని ఇక్కడే స్ట్రాంగ్ అయ్యారు.
ప్రభాస్ కేసు వేరు. బాహుబలి లాంటి ఆల్ టైం విజువల్ వండర్ తో తనకో గొప్ప లాంచ్ దొరికింది. రెగ్యులర్ కమర్షియల్ మూవీతో అయితే ఈ స్థాయికి చేరుకునే వాడు కాదు. మరి ఛత్రపతి సినిమాతో సాయి శ్రీనివాస్ ఎలాంటి అద్భుతాలు ఆశిస్తున్నాడో అంతు చిక్కడం లేదు. పైగా దాని డబ్బింగ్ వెర్షన్ యుట్యూబ్ లో ఎప్పటి నుంచో ఉంది. మళ్ళీ అదే కథను చూసేందుకు ఆసక్తి చూపిస్తారా అంటే అనుమానమే. ఎంతలేదన్న పెట్టుబడి మీద కనీసం సగం లాభం వచ్చేలా ఇతని బిజినెస్ హిందీలో జరుగుతుందని అందుకే నిర్మాతలు సిద్ధపడ్డారని ఇన్ సైడ్ టాక్. దీనికి దర్శకుడు ఎవరో తేలాక ఒక అంచనాకు రావొచ్చు