iDreamPost
iDreamPost
ఇప్పుడంటే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చూసి హీరో యాటిట్యూడ్ కు కొత్త డెఫినేషన్ వచ్చిందనుకుంటున్నాం కానీ ముప్పై ఏళ్ళ క్రితమే అలాంటి క్యారెక్టరైజేషన్స్ తెలుగులో వచ్చాయంటే అది కూడా స్వచ్ఛమైన ప్రేమకు ప్రతీకగా నిలిచాయంటే నమ్మశక్యం కాదేమో. కానీ ఇది నిజం. విలక్షణ దర్శకుడిగా సితార, అన్వేషణ, లేడీస్ టైలర్ లాంటి విభిన్న కథాంశాలు కలిగిన చిత్రాలతో ప్రేక్షకుల మెప్పు పొందిన వంశీ 1988లో మహర్షిని ప్రకటించారు. ఇళయరాజా సంగీతంలో రాఘవ, శాంతిప్రియ(భానుప్రియ చెల్లెలు)లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఈ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని తక్కువ లొకేషన్లలో వేగంగా పూర్తి చేశారు.
మహర్షి(రాఘవ)అనే కాలేజీ కుర్రాడికి డబ్బున్న మదంతో పాటు తల పొగరు చాలా ఉంటుంది. మనసు పడ్డది కోరుకున్నది ఎలాగైనా దక్కాలనే మనస్తత్వంతో కొన్నిసార్లు విపరీతంగా ప్రవరిస్తుంటాడు. కాలేజీలో సుచిత్ర(శాంతిప్రియ)పరిచయమయ్యాక ప్రేమలో పడతాడు. కానీ సుచిత్ర ససేమిరా అంటుంది. కొన్ని అనూహ్యమైన పరిణామాల తర్వాత సుచిత్ర తన చిన్ననాటి స్నేహితుడు పోలీస్ ఆఫీసర్ తిలక్(కృష్ణ భగవాన్ )ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత మహర్షి పిచ్చివాడై చేయిదాటే పరిస్థితికి వస్తాడు. ఆఖరికి సుచిత్రకు పుట్టిన బిడ్డను చూశాక కన్ను మూస్తాడు. అప్పటికైనా ఆమె ప్రేమను కొంతైనా గెలిచానన్న నమ్మకంతో.
మహర్షి నిజానికి అంచనాలు అందుకోలేకపోయింది. అప్పటి కమర్షియల్ సూత్రాలకు భిన్నంగా హీరో చాలా సేపు నెగటివ్ షేడ్స్ లో కనిపించడం, పెళ్ళైన హీరోయిన్ వెంట ప్రేమ అంటూ పడటం జనానికి నచ్చలేదు. పరాజయం తప్పలేదు. ఇళయరాజా అద్భుతమైన సంగీతం మహర్షికి చాలా బలమయ్యింది. మాటరాని మౌనమిది, సుమం ప్రతి సుమం, సాహసం నా పథం పాటలు మ్యూజిక్ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. తనికెళ్ళ భరణి సంభాషణలు హృద్యంగా సాగాయి. అయితే అప్పుడు ఫ్లాప్ అయినా మహర్షి తర్వాతి కాలంలో క్లాసిక్ స్టేటస్ దక్కించుకుంది. రాఘవకు సినిమా పేరే ఇంటిపేరుగా మారే పాపులారిటీ వచ్చింది.