iDreamPost
iDreamPost
తంబళ్లపల్లె, రాజకీయాలతో కనీసం పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన నియోజకవర్గం.. 90వ దశకం ముందు భూస్వాములు-నక్సల్ గొడవలు..90వ దశకం నుంచి 2004 వరకు కాంగ్రెస్, బీజేపీ గొడవలు..ఆ తరువాత పెద్దిరెడ్డి కుటుంబం వలన తంబళ్లపల్లి రాజకీయం ఎప్పుడు చర్చల్లో ఉంటూ వచ్చింది.
తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర రెడ్డి చాలా కాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం అనారోగ్యంతో చనిపోయారు.ప్రభాకర రెడ్డి మరణంతో తొలితరం రాజకీయ కుటుంబాల రాజకీయ ప్రస్థానం ముగిసినట్లయింది.
టి.యన్.కుటుంబం
తంబళ్లపల్లె అంటే మొదట గుర్తొచ్చేది టి.యన్. కుటుంబం. టి.యన్ కుటుంబం నుంచి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ గా గెలిచారు. తొలి ఎన్నికలు 1951లో గట్టు నియోజక వర్గం (ఇది రద్దయ్యి 1955 ఎన్నికల్లో తంబళ్లపల్లె ఏర్పడింది) నుంచి టి.యన్.వెంకట్ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు.1955 ఎన్నికల్లో కూడా గెలిచిన టి.యన్.వెంకట సుబ్బారెడ్డి ఆధిపత్యానికి కలిచెర్ల నరసింహా రెడ్డి (ప్రభాకర రెడ్డి తండ్రి) రూపంలో గండి పడింది. 1962 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ తరుపున పోటీచేసిన కలికిచెర్ల నర్సింహా రెడ్డి టి.యన్ వెంకట సుబ్బారెడ్డిని ఓడించాడు.. అక్కడి నుంచి టి.యన్ వర్సెస్ కలికిచెర్ల కుటుంబంగా రాజకీయం నడిచింది.
టి.యన్ కుటుంబం నుంచి 1983లో శ్రీనివాస రెడ్డి ఇండిపెండెంట్ గా గెలిచారు. అదే టి.యన్ కుటుంబానికి చివరి గెలుపు.
Also Read:మళ్లీ కాలుదువ్వుతున్న అమరనాథ్ రెడ్డి
టీడీపీ ఆవిర్భావం- ఉమాశంకర్ రెడ్డి హత్య
టీడీపీ ఆవిర్భవించిన తరువాత తంబళ్లపల్లె కు చెందిన అనిపిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి అనే సాధారణ యువకుడిని చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఎన్టీఆర్ నియమించాడు. ఉమా శంకర్ రెడ్డి కమలాపురం వీరశివారెడ్డి చెల్లెలు లక్ష్మి దేవమ్మను వివాహం చేసుకున్నాడు. 1983 నాటికి వీరశివారెడ్డి గ్రామస్థాయి నాయకుడే, ఉమా శంకర్ రెడ్డికి పదవి రావటంలో ఆయన పాత్ర లేదు.
తంబళ్లపల్లె లో భూస్వాములకు ,పీపుల్స్ వార్ మధ్య ఘర్షణ జరుగుతుండేది. ఉమా శంకర్ రెడ్డి కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి కూలిరేట్లు పెంచటానికి ఉద్యమాలు నడిపాడు. ఆ ఉద్యమం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది, ఎన్టీఆర్ దృష్టిలో పడటానికి కూడా ఒక ప్రధాన కారణం.
1983 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీచేసిన ఉమాశంకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి టి.యన్ శ్రీనివాసుల రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఎన్టీఆర్ ప్రభంజనం కూడా ఉమాశంకర్ రెడ్డి గెలుపుకు ఉపయోగపడలేదు. చిత్తూరు జిల్లా మొత్తంలో టీడీపీ ఓడిపోయిన ఏకైక స్థానం తంబళ్లపల్లె .పక్కనున్న వాయలపాడు నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి కూడా ఓడిపోయాడు.
ఉమా శంకర్ రెడ్డి హత్య
1983 ఎన్నికల్లో ఓడిపోయిన ఉమా శంకర్ రెడ్డికి ఎన్టీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు. 1984 లోక్ సభ ఎన్నికల సమయంలో ఉమా శంకర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఉమా శంకర్ రెడ్డికి సంబంధించి కూలి సంఘం వాళ్ళు గతంలో ఒక రైతును హత్య చేశారు . ఆ హత్యకు ఉమా శంకర్ రెడ్డే కారణమన్న అనుమానంతో చనిపోయిన రైతుకు సంబంధించిన వారు ఉమా శంకర్ రెడ్డిని చంపారు . ఉమాశంకర్ రెడ్డి పాడెను ఎన్టీఆర్ స్వయంగా మోసారు .
1985 ఎన్నికల్లో ఉమా శంకర్ రెడ్డి శ్రీమతి లక్ష్మీదేవమ్మ టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.
Also Read:పల్లంరాజు… తాత మనవలు – మూడు రాష్ట్రాల ఏర్పాటుకు ప్రత్యక్ష సాక్షులు..
ప్రభాకర రెడ్డి రాజకీయ రంగప్రవేశం
కలిచెర్ల అనేది గ్రామం పేరు. రాయలసీమలో ఎక్కువ శాతం గ్రామము పేర్లే ఇంటి పేర్లుగా ఉంటాయి కానీ ప్రభాకర రెడ్డి ఇంటి పేరు కడప.
కలికిచెర్ల నర్సింహారెడ్డికి సుధాకర రెడ్డి,విజయమ్మ,ప్రభాకర్ రెడ్డి,మధుకర్ రెడ్డి నలుగురు సంతానం. నర్సింహారెడ్డి ఒకసారి సమితి అధ్యక్షుడిగా,ఒకసారి ఎమ్మెల్యే గా,మధుకర్ రెడ్డి ఒకసారి సమితి అధ్యక్షుడిగా గెలిచారు. సుధాకర్ రెడ్డి మాత్రం రెండుసార్లు (1972 & 1978) ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు.
కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి 1987 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పెద్దమండ్యం ఎంపీపీ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటంతో రాజకీయ జీవితం మొదలైంది. కలిచెర్ల కుటుంబం 2000 ఎకరాల భూస్వాములని చెబుతారు. ప్రభాకర్ రెడ్డి తన వాటాగా వచ్చిన భూమిలో వందల ఎకరాలు సుగాలి మరియు ఇతర వెనక బడిన భూమిలేని వర్గాల వారికి దానం ఇచ్చాడు. దాని వలెనే కావచ్చు ఆయన ఏపార్టీలో ఉన్నా షుమారు 30 వేల సొంత ఓట్ బ్యాంకు ఉంది.1989 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ టి.యన్ శ్రీనివాసుల రెడ్డికి దక్కటంతో ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్ గా పోటీచేసి టీడీపీ లక్షిదేవమ్మను ఓడించాడు.
చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేలలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్గం అంటే మొదటి ఇద్దరు ప్రభాకర్ రెడ్డి మరియు సీకే బాబు..
ప్రభాకర్ రెడ్డి వర్సస్ చల్లపల్లి
రాయలసీమలో బీజేపీకి కొంచం బలం ఉన్నది పశ్చిమ చిత్తూరు జిల్లాలోనే. ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన చిలకం రాంచంద్రారెడ్డి సమితి అధ్యక్షుడిగా గెలిచాడు. చల్లపల్లి నర్సింహారెడ్డి మదనపల్లి బీటీ కాలజీలో చదువుకునే రోజుల్లో జనసంఘ్ కు దగ్గరయ్యి ఆ తరువాత బీజేపీలో కొనసాగుతున్నాడు. పది ఓట్లు లేని నరసింహారెడ్డి సొంత బలంతో ఎదిగాడని ఇప్పటికి అంటారు.చల్లపల్లి మీద పెద్ద మండ్యం మండల ఆధిపత్య పోరులో 1997లో ఒకసారి బాంబు దాడి జరిగింది.
Also Read: పెద్దిరెడ్డి మీద పోటీకి కొత్త “బాబు”ను సిద్ధం చేసిన చంద్రబాబు…
1999 & 2004 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా తంబళ్లపల్లె టికెట్ చల్లపల్లి నర్సింహారెడ్డికి ఇచ్చారు. మూడో నాయకుడిని ఎదగనియ్యకూడదన్న ఆలోచనతో 1999 ఎన్నికల్లో లక్షిదేవమ్మ కాంగ్రెస్ తరుపున పోటీచేసిన కలిచెర్ల ప్రభాకర్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇచ్చి ఆయన గెలవటానికి దోహద పడ్డారు.
2004 ఎన్నికల్లో స్వయంగా లక్ష్మీదేవమ్మ రెబల్ గా పోటీ చేసి దాదాపు 21 వేల ఓట్లు పొందారు కానీ ఆ ఎన్నిక హోరా హోరీగా జరిగింది. ప్రభాకర్ రెడ్డి కేవలం 600 ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.. అక్కడి నుంచి చల్లపల్లి బలం తగ్గటం మొదలైంది..
ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ
2009 ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డికి టికెట్ విషయంలో పోటీ ఉంటుందన్న చర్చ కూడా లేదు , కానీ ఫిబ్రవరిలో తంబళ్లపల్లె వైఎస్సార్,పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న బహిరంగ సభ తరువాత అనూహ్యంగా గొలోల్ల శంకర్ పేరు తెర మీదికి వచ్చింది. తంబళ్ళపల్లె యాదవ సామాజిక వర్గానికి చెందిన శంకర్ బెంగుళూరు లో వ్యాపారాలు చేసేవాడు,నియోజకవర్గంలో పెద్దగా పరిచయం లేదు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రభాకర్ రెడ్డి మేనల్లుడు, వైఎస్సార్ తో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నా కానీ అవి టికెట్ రావటానికి ఉపయోగపడలేదు.. కాంగ్రెస్ టికెట్ శంకర్ కు దక్కటం తో చివరి నిమిషంలో ప్రజారాజ్యం తరుపున పోటీచేసి 30 వేల ఓట్లు సాధించాడు. తాను గెలవలేక పోయినా,కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ ను ఓడించంటం,పాత ప్రత్యర్థి బీజేపీ చల్లపల్లి నర్సింహా రెడ్డి కన్నా దాదాపు 15 వేల ఓట్లు సాధించటం ప్రభాకర్ రెడ్డికి సంతృప్తిని ఇచ్చి ఉండొచ్చు.
2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ప్రభాకర్ రెడ్డి నెల తిరగకుండానే వైసీపీలో చేరి వైసీపీ అభ్యర్థి అనిపిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి (లక్ష్మి దేవమ్మ కుమారుడు) గెలుపుకు కృషి చేసాడు కానీ టీడీపీ గాలి,అంతకు ముందు కాంగ్రెస్ తరుపున ఓడిపోయిన శంకర్ టీడీపీ అభ్యర్థి కావటం, అతని మీద సానుభూతి అన్ని కలిసి ప్రవీణ్ ఓడిపోయాడు.
గత ఎన్నికల్లో పెద్దైరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు . టీడీపీలో శంకర్,ప్రవీణ్ రెడ్డిల మధ్య ఇన్ ఛార్జ్ పదవి మ్యూజికల్ చైర్ ఆడుతుంది..
మరణంతో ముగిసిన శకం
ప్రభాకర్ రెడ్డి సోదరులు సుధాకర్ రెడ్డి,మధుకర్ రెడ్డి ఇద్దరు జీవించి ఉన్నారు.. ప్రభాకర్ రెడ్డికి పిల్లలు లేరు,ఆయన సోదరులు ఇద్దరికి ఆడ పిల్లలే. అందరికి వివాహం అయ్యింది. వారందరు రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యాపారాల చేసుకుంటున్నారు.కలిచెర్ల కుటుంబం నుంచి ఇప్పుడు ఎవరు రాజకీయాల్లో లేరు.. 1989 ఎన్నికలతో టి.యన్ కుటుంబం,2019 ఎన్నికలతో కలిచెర్ల కుటుంబం రాజకీయాలు ముగిసినట్లే.
కరువు పీడిత తంబళ్లపల్లె నియోజకవర్గంకు నీటి వసతి కల్పించటం కోసం వైస్సార్ హయాంలో ప్రభాకర్ రెడ్డి ఆకుమని గుట్ట ,చిన్నేరు , మాడుగూరు వద్ద మరో ప్రాజెక్ట్ నిర్మించారు-నిండుకుండల్లా సీమ ప్రాజెక్టులు – పొంగిపొర్లుతున్న పెద్దేరు
ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ములకలచెరువు నుంచి మదనపల్లికి డబల్ రోడ్ శాంక్షన్ చేపించాడు.
వయసుతో వచ్చిన ఆరోగ్య ఇబ్బందులతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న 77 సంవత్సరాల కలికిచెర్ల ప్రభాకర్ రెడ్డి ఈ మధ్యాహ్నం బెంగుళూర్ లోని St.Johns ఆసుపత్రిలో మరణించారు. రేపు సొంత గ్రామం కలిచెర్లలో అంతక్రియలు జరుగుతాయి..