iDreamPost
android-app
ios-app

మాస్ మెచ్చని సెంటిమెంట్ – Nostalgia

  • Published Sep 02, 2020 | 1:12 PM Updated Updated Sep 02, 2020 | 1:12 PM
మాస్ మెచ్చని సెంటిమెంట్  – Nostalgia

స్టార్ హీరోకు మాస్ లో ఒక ఇమేజ్, ఫాలోయింగ్ వచ్చాక దానికి భిన్నంగా వెళ్తే ప్రతిసారి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయన్న గ్యారెంటీ లేదు. ఎంత ఫ్యామిలీ సబ్జెక్టు ఎంచుకున్నా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు ప్రేక్షకులు పెట్టుకునే అంచనాలు దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇందులో ఏ చిన్న పొరపాటు చేసినా బాక్సాఫీస్ దగ్గర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాంటిదే ఈ సంఘటన. నందమూరి తారకరామారావు గారి వారసుడిగా తెరకు పరిచయమైన బాలకృష్ణ మంగమ్మ గారి మనవడుతో తన స్థానాన్ని సుస్థిరపరుచుకుని ఆపై కోడి రామకృష్ణ తీసిన విలేజ్ డ్రామాలతో తిరుగులేని మార్కెట్ తో దూసుకుపోతున్న సమయం అది. చెల్లి సెంటిమెంట్ తో రూపొందిన ముద్దుల మావయ్య పాత రికార్డులు తిరగరాయడం చూసి ట్రేడ్ సైతం ముక్కున వేలేసుకుంది.

ఆ టైంలో 1991లో బాలయ్య చేసిన సినిమా తల్లితండ్రులు. తాతినేని రామారావు దర్శకత్వంలో ఏవి సుబ్బారావు నిర్మించిన ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది. కారణం అప్పటికే అవుట్ డేటెడ్ అయిన కథాకథనాలను ఎంచుకోవడమే. నిజాయితీపరుడైన తండ్రి విలన్ వల్ల అప్పులపాలై రోడ్డుపైకి వస్తే హీరో అప్పటికే విడిపోయి బయటికి వచ్చిన హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్న పాయింట్ తో ఇది రూపొందింది. పాయింట్ లోనూ అటు మేకింగ్ లోనే 70వ దశకం వాసనలు రావడంతో ప్రేక్షకులు దీనికి విజయాన్ని కట్టబెట్టలేకపోయారు. రొటీన్ గాసాగితే ఫ్యామిలీ డ్రామా అయినా జనం మెచ్చరని రుజువయ్యింది.

అందులోనూ లారీ డ్రైవర్ లాంటి మాసివ్ హిట్ తర్వాత వచ్చిన సినిమా కావడం ప్రభావం చూపించింది. పరుచూరి బ్రదర్స్ రచన, సంగీత దిగ్గజం చక్రవర్తి పాటలు, సుందరం ఛాయాగ్రహణం వీళ్లంతా క్వాలిటీ పరంగా బెస్ట్ ఇచ్చినప్పటికీ అప్పటి హైప్ కు తగ్గట్టు తల్లితండ్రులు నిలవలేకపోయింది. అందులోనూ మరీ పాత స్టైల్ లో టైటిల్ ని ఎంచుకోవడం కూడా కొంతమేర మైనస్ గా నిలిచింది. విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, గుమ్మడి, జగ్గయ్య, పరుచూరి వెంకటేశ్వరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. నువ్వే కావాలి హీరో తరుణ్ ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. అప్పటి సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఓ మోస్తరుగా ఓకే అనిపించే తల్లితండ్రులు తర్వాత బాలయ్య మళ్ళీ అంత ఓల్డ్ ఫ్లేవర్ టైటిల్ తో సినిమా చేయలేదు.