ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వైరస్ ఒక వైపు తగ్గుతోందని సంతోషించే లోపే మరోవైపు ఎక్కడికక్కడ కేసులను పెంచుకుంటూ పోతూ ఖంగారుని పెంచేస్తోంది. సినిమాలు, షూటింగుల గురించి ఏ ప్రభుత్వమూ ఆలోచించడం లేదు. నిజానికి ఆ అవకాశమూ లేదు. థియేటర్లను ఎప్పుడు తెరుస్తారాని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ కోరిక దగ్గరలో ఫలించే అవకాశం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా కరోనా అప్పటికల్లా సద్దుమణుగుతుందనే ఉద్దేశంతో జులై 17న ప్లాన్ చేసిన హాలీవుడ్ క్రేజీ మూవీ టెనెట్ ని మళ్ళీ ఆగష్టుకు వాయిదా వేశారు. వరల్డ్ వైడ్ కనివిని ఎరుగని రీతిలో దీని రిలీజ్ ని షెడ్యూల్ చేశారు.
కానీ ఇండియా సహా పలు కీలక దేశాల్లో పరిస్థితి సీరియస్ గానే ఉండటంతో చేతిలో ఉన్న 20 రోజుల్లో అంతా నార్మల్ కావడం అసాధ్యమని నిర్మాణ సంస్థకు అర్థమైపోయింది. క్రిస్టోఫర్ నోలన్ దీనికి దర్శకుడు కావడం వల్ల విపరీతమైన హైప్ నెలకొంది. ది డార్క్ నైట్, ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లార్ లాంటి మాస్టర్ పీసులను రూపొందించిన ఈయనకు కోట్లాది అభిమానులు ఉన్నారు. ఇంటర్ స్టెల్లార్ హైదరాబాద్ లోనే వంద రోజులు ఆడటం దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. తాజాగా టెనెట్ కు ఫిక్స్ చేసిన డేట్ ఆగస్ట్ 12. ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది కనక విడుదలైతే థియేటర్లకు, మల్టీ ప్లెక్సులకు పూర్వ వైభవం వస్తుందని ట్రేడ్ నమ్మకం. దీని మీద పెట్టుబడులు కూడా భారీగా సాగుతున్నాయి. ఒకవేళ రిలీజైతే ఖచ్చితంగా జనం పోటెత్తుతారు.
అందులోనూ తెలుగుతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ వస్తుంది కాబట్టి క్రౌడ్ ని ఎక్కువగా ఆశించవచ్చు. అయితే నాలుగు గోడల మధ్య ఎయిర్ కండీషన్ సౌకర్యం లేకుండా కేవలం ఫ్యాన్ గాలితో సినిమాను ఆస్వాదించడం ఇప్పటి జెనరేషన్ కు కష్టం. మరోవైపు మల్టీ ప్లెక్సుల యాజమాన్యాలు తమ కాంప్లెక్సుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారో కళ్ళకు కట్టినట్టుగా వివరించేలా వీడియోలు తీసి విడుదల చేశారు. కస్టమర్లను ఇవి ఆకట్టుకుంటున్నాయి కానీ గవర్నమెంట్స్ లైట్ తీసుకున్నాయి. టెనెట్ లో జాన్ డేవిడ్, రాబర్ట్ పాటిన్సన్, ఎలిజిబెత్, మైకేల్ క్యానీ తదితరులతో పాటు బాలీవుడ్ నిన్నటి తరం హీరోయిన్ డింపుల్ కపాడియా ఓ కీలక పాత్ర చేశారు. భారీ అంచనాలు మోస్తున్న టెనెట్ ఆగస్ట్ లో అయినా వస్తుందో రాదో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.