Idream media
Idream media
జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం తెలంగాణ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆ ఫలితాలను బట్టి వ్యూహాలు రచిస్తున్నాయి. ఎక్కడ ఓడిపోయామో.. ఎందుకు అలా జరిగిందో తెలుసుకుంటూ లోటుపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా హోరాహోరీగా పోరాడిన టీఆర్‌ఎస్, బీజేపీలు అసెంబ్లీ ఎన్నికలే ధ్యేయంగా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్లు గ్రేటర్ ఫలితాలలో తేలింది. ఉద్యోగులు ఎక్కువగా నివసించే ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. పోస్టల్ బ్యాలెట్‌లోనూ బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీనిపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులతో ఇప్పటికే చర్చించారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యతిరేకత గల కారణాలను తెలుసుకుని పరిష్కరించే దిశగా టీఆర్‌ఎస్ అడుగులు వేస్తోంది.
మరోవైపు కమలం గురి..
పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ఉత్సాహంగా బీజేపీ దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందే టీఎన్జీవో పూర్వ అధ్యక్షుడు, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ను చేర్చుకున్న బీజేపీ.. ఇక మరికొందరు నాయకులను కమలం గూటికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్వామిగౌడ్ చేరిక అనంతరం టీఎన్జీవోల సంఘం పూర్వ అధ్యక్షుడు, తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడితో మూడు సార్లు మంతనాలు జరిపింది. కేంద్రంలో స్వామిగౌడ్‌కు మంచి పదవి ఇస్తామని, పార్టీలో చేరితే సాధారణ ఎన్నికల్లో సముచిత గౌరవం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. టీఎన్జీవోల పూర్వ అధ్యక్షుడు పదవీ విరమణ చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌తో భేటీకి ప్రయత్నిస్తున్నా అపాయింట్‌మెంట్ దొరక్కపోవడం కూడా వీరిలో నిరాశను పెంచుతోంది. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం వల్లే టీఆర్‌ఎస్‌ను వీడినట్లు స్వామిగౌడ్ అప్పట్లో ప్రకటించారు. మరో పూర్వ నేత కూడా కమలం ఆఫర్‌ను ఆమోదించాలా? వేచిచూడాలా? అని ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే రెవెన్యూ శాఖలో కేసీఆర్ ఇటీవల తెచ్చిన మార్పులపై కొంత మంది ఆ శాఖ ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన శాఖను కేసీఆర్ నిర్వీర్యం చేశారని, ప్రభుత్వంతో అమీతుమీగా తలపడాలంటే బీజేపీ మినహా మరో మార్గం లేదని వారు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో అటు టీఆర్‌ఎస్, ఇటు బీజేపీ ఉద్యోగ సంఘాలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి.