iDreamPost
android-app
ios-app

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు

నేడు తెలంగాణ కేబినెట్‌ భేటీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు

తెలంగాణ మంత్రివర్గం ఈ రోజు సాయంత్రం ప్రగతి భవన్‌లో సమావేశం కానుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా సమావేశం అవుతున్నా.. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ప్రచారంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అన్‌లాక్‌ తర్వాత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి పెరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16,339 మందికి కరోనా సోకగా అందులో ఒక్క హైదరాబాద్‌ పరిధిలోనే 12, 682 కేసులు నమోదవడం తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.

హైదరాబాద్‌లో కేసులు పెరుగుతుండడంతో మళ్లీ లాక్‌డౌన్‌ అమలు చేస్తారనే ప్రచారం ఇటీవల ఊపందుకుంది. చెన్నై, ముంబై తదితర నగరాల్లోనూ మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టడంతో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ నాలుగు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ కూడా లాక్‌డౌన్‌ విషయం పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మూడు నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్‌ చెప్పిన ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు మంత్రివర్గం సమావేశంలో చర్చించిన తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్‌ పెట్టే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎప్పటి లాగే మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడే సీఎం కేసీఆర్‌ ఈ సారి కూడా మాట్లాడే అవకాశం ఉంది.

సీఎం కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్‌లో ఉపాధి, ఉద్యోగం, వ్యాపార నిమిత్తం ఉంటున్న ఏపీ, తెలంగాణలోని వివిధ ప్రాంతాల వారు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న ఏపీ వాసులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే దారిలో నల్గొండ జిల్లా సరిహద్దుల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. టోల్‌ ప్లాజాల వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. స్పందన వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా ముందుగా పాస్‌ తీసుకుంటేనే పోలీసులు ఏపీలోకి బయట ప్రాంతాల నుంచి వచ్చే వారిని అనుమతిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి పంపుతున్నారు. స్వస్థలాలకు వెళ్లిన తర్వాత హోం క్వారంటైన్‌లో తప్పకుండా ఉండేలా ఏపీ ప్రభుత్వం సచివాలయంలోని మహిళా పోలీస్, వాలంటీర్ల ద్వారా పర్యవేక్షణ చేపడుతోంది.