తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 15 రోజులు నిర్వహించాలా..? వారం రోజులు చాలా..? కొవిడ్ నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే అంశాలపై చర్చ ఒక వైపు.. అసెంబ్లీలో అమలు చేయాల్సిన వ్యూహాలపై సమావేశాలు మరోవైపు.. కొద్ది రోజులుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కొవిడ్ బారిన పడ్డారు. తాజాగా మంత్రి హరీశ్ రావు కూడా కరోనా సోకినట్లు ప్రకటించారు. గతంలో ఆయన పీఏ, గన్ మన్ కు కరోనా సోకినప్పుడు చాలా కాలం ఆయన హోం క్వారంటైన్ లో ఉండే నియోజవర్గ సమస్యలపై ఆడియో, వీడియో కాల్ ద్వారా స్పందించేవారు. కొంత కాలంగా ఆయన క్షేత్ర స్థాయిలో కూడా చురుగ్గా తిరుగుతున్నారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ పరంగా, పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన చర్చలో కూడా ఆయన పాల్గొన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా తనకు కరోనా సోకినట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటికప్పుడు తానే తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా ద్వారా చెబుతానని తెలిపారు.
ఎమ్మెల్యేలందరికీ పరీక్షలు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడం, కరోనా విస్తరిస్తుండడంతో ఎమ్మెల్యేలందరికీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందరికీ పరీక్షలు చేసింది. నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన వారికే అసెంబ్లీలోకి రావాలని కూడా చెప్పింది. ఎమ్మెల్యేలకే కాదు.. మీడియా సిబ్బందికి, అసెంబ్లీ సమావేశాలకు బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే అందరి రిపోర్టులు కూడా అందాయి. అసెంబ్లీ ప్రాంగణంలోను, లోపల కూడా శానిటైజ్ చేశారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. భౌతిక దూరం ఉండేలా అసెంబ్లీ లోపల సీట్లు కూడా మార్పులు చేసినట్లు తెలిసింది. అలాగో మరోవైపు ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే చర్చించింది. కొవిడ్ కాలంలో జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై అంతటా ఆసక్తి ఏర్పడింది.