iDreamPost
android-app
ios-app

అచ్చెన్నను గెలిపించి తప్పు చేశామా..?

  • Published Jan 06, 2022 | 5:55 AM Updated Updated Mar 11, 2022 | 10:26 PM
అచ్చెన్నను గెలిపించి తప్పు చేశామా..?

జగన్ కు ఓట్లు వేసి గెలిపించి తప్పు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ప్రజలను ఆడిపోసుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోనందునే ప్రజలు తమను తప్పించారన్న వాస్తవాన్ని గ్రహించకుండా గతంలో చంద్రబాబు.. తాజాగా అచ్చెన్నాయుడు ప్రజలనే తప్పు పడుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎవరికి ఎందుకు ఓట్లు వేశారన్నది పక్కన పెడితే.. ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ వైపు నిలిచినా టెక్కలిలో మాత్రం టీడీపీ అభ్యర్థి అచ్చెన్నను గెలిపించిన అక్కడి ఓటర్లు.. అలా ఎందుకు చేశామా.. అని ఇప్పుడు బాధ పడుతున్నారు. ప్రజలే కాదు.. టీడీపీ క్యాడర్ కూడా అదే అభిప్రాయంతో ఉంది. ఎన్నికైన నాటి నుంచి తమ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అధ్యక్ష పదవి పేరుతో దూరంగా..

గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేతిలో టీడీపీ చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్ష పాత్రలోకి మారింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీకి కేవలం 23 సీట్లే దక్కాయి. వాటిలో రెండు శ్రీకాకుళం జిల్లా నుంచి గెలిచినవి కాగా గెలిచిన ఆ ఇద్దరిలో అచ్చెన్నాయుడు ఒకరు.
ఆ తర్వాత ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆయాచితంగా దక్కింది. దాంతో ఆయన రాష్ట్ర పార్టీని ఎంత ఉద్ధరిస్తున్నారో గానీ సొంత నియోజకవర్గాన్ని మాత్రం పట్టించుకోవడం మానేశారు. సమస్యలు చెప్పుకుందామంటే ఆయన దర్శనభాగ్యమే లభించడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలది కూడా అదే పరిస్థితి. ఒకవైపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ దూకుడుగా ముందుకు పోతుంటే.. తాము వారికి పోటీగా ఎదగలేకపోతున్నామని వాపోతున్నారు. అండగా నిలవాల్సిన నాయకుడు అందుబాటులో లేక పార్టీ కార్యక్రమాలు కూడా చేపట్టలేక పోతున్నామంటున్నారు.

చుట్టపు చూపుతో సరి

పార్టీ పెత్తనాల పేరుతో అచ్చెన్నాయుడు అయితే విజయవాడ లేదా విశాఖలో గడిపేస్తున్నారు. టెక్కలి నియోజకవర్గానికి రావడం బాగా తగ్గిపోయింది. తమ కుటుంబంలో లేదా పార్టీ పరంగా ముఖ్య కార్యక్రమాలు ఉన్నప్పుడే ఇక్కడికి వస్తున్నారు. ఏదో చుట్టపు చూపుగా అందరినీ పలకరించి వెళ్లిపోతున్నారు. మిగతా సమయాల్లో ఆయనతో మాట్లాడాలంటే విజయవాడ లేదా విశాఖలకు వెళ్లాల్సి వస్తోందని ప్రజలతో పాటు టీడీపీ కార్యకర్తలు అంటున్నారు. అదే ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఢిల్లీలో బిజీగా ఉన్నా సరే నియోజకవర్గ ప్రజలకు ఏదో విధంగా అందుబాటులో ఉండేవారని గుర్తుచేసుకుంటున్నారు. నాయకుల తీరు ఇలా ఉంటే మళ్లీ ఓట్లు ఎలా వేస్తామని పలువురు ప్రశ్నిస్తున్నారు.