iDreamPost
android-app
ios-app

పండగ మీద కన్నేసిన కోతి కొమ్మచ్చి

  • Published Dec 17, 2020 | 12:15 PM Updated Updated Dec 17, 2020 | 12:15 PM
పండగ మీద కన్నేసిన కోతి కొమ్మచ్చి

2021 సంక్రాంతికి టాలీవుడ్ కొత్త సినిమాలు ఏవి వస్తాయనే క్లారిటీ ఇప్పటికీ లేదు. తెలుగు నిర్మాతలు, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఏర్పడ్డ ప్రతిష్టంబన ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు జనవరి నుంచి ప్రభుత్వాలు థియేటర్లకు వంద శాతం సీటింగ్ కెపాసిటీకి అనుమతులు ఇస్తాయా అనే అనుమానాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక్క రవితేజ క్రాక్ మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో సినిమా హాళ్లలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యిందట. అరణ్యకు కూడా ఛాన్స్ ఉంది. రెడ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, లవ్ స్టోరీ తదితరాలన్నీ మళ్ళీ పునరాలోచనలో పడినట్టు సమాచారం.

ఈ అవకాశాన్ని మీడియం మరియు చిన్న సినిమాలు వాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ క్రాక్ మాత్రమే వస్తే కనక అదొక్కటే పండగకు సరిపోదు కాబట్టి తాము వస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కోతి కొమ్మచ్చి టీమ్ ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్ల నుంచి విడుదల కోసం నిర్మాతతో పాటు దర్శకుడు సతీష్ వేగ్నేశ మీద ఒత్తిడి వస్తోందట. నిజానికి ఇందులో స్టార్లు లేరు. సతీష్ అబ్బాయి సమీర్ ని హీరోగా పరిచయం చేస్తూ అతనితో పాటు శ్రీహరి వారసుడు మేఘాంశ్ ని ఇంకో కథానాయకుడిగా తీసుకున్నారు. రిద్ది కుమార్. మేఘ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, నరేష్ మిగిలిన క్యాస్టింగ్ లో ఉన్నారు.

కేవలం నెల రోజుల్లో నాలుగు పాటలతో సహా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయడం, అది కూడా ఇంకా లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతుండగానే జరగడం నిజానికి ఆశ్చర్యం కలిగించే విషయమే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం ఆకర్షణగా నిలవబోతోంది. ఒకవేళ పండక్కు కనక అవకాశం దొరికితే ఫామిలీ బ్యాక్ డ్రాప్ లో ఎంటర్ టైన్మెంట్ జానర్ లో రూపొందిన కోతి కొమ్మచ్చికి మంచి ఛాన్స్ వచ్చినట్టే. శతమానం భవతి రూపంలో జాతీయ అవార్డు సినిమా అందించిన సతీష్ వేగ్నేశకి దీని విజయం చాలా కీలకం. థియేట్రికల్ తో పాటు డిజిటల్ రైట్స్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట.